స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక మలుపు..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్, ఆయన భార్య ఐఏఎస్ అధికారి అపర్ణ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.. ఆ పిటిషన్‌పై ఇవాళ బెజవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరపనుంది.. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది.. అయితే, సీఐడీ కోర్టు రిమాండ్ తిరస్కరిస్తూ ఆదేశాలు ఇవ్వటంతో భాస్కర్ ను విడుదల చేశారు సీఐడీ అధికారులు.. మరోవైపు సీఐడీ కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు.. ఇక, సీఐడీ కోర్టు ఇచ్చిన అదేశాలు రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఈ నేపథ్యంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం.. ఏసీబీ కోర్టును ఆశ్రయించారు భాస్కర్, ఆయన భార్య అపర్ణ..
ఆమె టీచర్.. సినిమాలో స్టైల్‌లో చీటింగ్..
చెన్నైలో బయటపడిన సినిమా స్టైల్‌లో జరుగుతోన్న చీటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారులను టార్గెట్ చేసింది హెసల్ అనే స్కూల్ టీచర్.. సోషల్ మీడియాలో ఖాతాను ఓపెన్ చేసిన ఆమె.. బడా వ్యాపారులను టార్గెట్ చేస్తూ.. చాటింగ్ చేస్తుంది.. పెళ్లి జరిగి కొద్ది రోజులకే భర్త చనిపోయాడని తనకు ఇప్పుడు ఎవరు లేరని నమ్మబలికేది.. బడా వ్యాపారులతో సన్నిహితంగా ఉంటూ.. వారి వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేసింది.. వ్యాపారుల నుంచి తన బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేయించుకన్న తర్వాత.. హెసల్ వారిని కట్ చేస్తూ వెళ్లింది.. అయితే, ముంబైకి చెందిన వ్యాపారి రాజేష్ ఇచ్చిన ఫిర్యాదుతో అప్రమత్తమైన కోయంబత్తూర్ పోలీసులు.. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. తీగ లాగితే డొంక కదులుతున్నట్టు.. పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగు చూశాయి.. హెసల్ డబ్బు కోసం చాలా మందిని మోసం చేసినట్టు విచారణలో తేల్చారు పోలీసులు.. చివరకు హెసల్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తంగా.. ముంబైకి చెందిన వ్యాపారిని రూ.20 లక్షలు మోసం చేసింది కోయంబత్తూరుకు చెందిన టీచర్.. ముంబైలోని చెంబూరు సెల్ కాలనీకి చెందిన ఆర్ రాజేష్ (44) పోదనూరు పోలీస్ స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్ మణికి ఫిర్యాదు చేశారు. ముంబైలోని చెంబూర్ రైల్వే స్టేషన్‌లో తాను ట్రావెల్స్ ఏజెన్సీని నడుపుతున్నట్లు రాజేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతను తన బంధువు ద్వారా 2020లో లోరెన్ అనే మహిళతో స్నేహం చేశాడు. తరువాత, లోరెన్ తన చెల్లెలు హెసల్ జేమ్స్‌ను పరిచయం చేసింది. ఆమె నాకు అవివాహిత అని మొదట్లో చెప్పింది. తరువాత, ఆమె వితంతువు అని చెప్పింది. కొన్ని నెలల తర్వాత, తాను తన భర్త నుండి విడిపోయానని, కోయంబత్తూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు పెండింగ్‌లో ఉందని చెప్పింది. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి పోదనూరులోని సత్యసాయి నగర్‌లో నివాసం ఉంటున్నట్లు చెప్పింది. ఆమె రూ.90,000 అప్పుగా అగిగితే నేను ఆమెకు అందించాను. ఆమె నా నుండి కారు, మొబైల్ ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు మరియు ఇతర బహుమతులతో సహా రూ. 20 లక్షల విలువైన వస్తువులను పొందింది అని ఫిర్యాదులో పేర్కొన్నాడు రాజేష్. అయితే, ఆమెకు చాలా మందితో పరిచయం ఉన్న విషయం తెలుసుకున్న బాధితుడు.. తాను ఇచ్చిన బహుమతులు, కారును తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే, ఆమె వాటిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది.. అంతేకాదు.. అవసరం అయితే నిన్ను లేపేస్తానని బెదిరించింది.. రూ. 2 లక్షలు ఇస్తే నిన్ను చంపేసే ముఠా నా దగ్గర ఉందని వార్నింగ్ ఇచ్చింది.. దీంతో నేను మోసపోయానని గుర్తించిన రాజేష్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం వెలుగు చూసింది.
కలకలం రేపుతోన్న బీజేపీ నేత హత్య.. నాటు బాంబులతో దాడి, కత్తులతో నరికి..!
పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ నేత హత్య సంచలనం రేపుతోంది.. మంగళం నియోజకవర్గ బీజేపీ కార్యదర్శిగా ఉన్న సెంథిల్‌కుమార్.. గత రాత్రి ఓ బేకరీ దగ్గర ఉండగా.. మూడు బైక్‌లపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు.. ముందుగా నాటు బాంబులతో దాడి చేసి.. ఆ తర్వాత కత్తులతో ఎటాక్ చేసి నరికి చంపారు.. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. బైక్‌లపై రావడం.. బాంబులు విసరడం.. కత్తులతో నరకడం.. ఇలాంటి దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యాయి.. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే సెంథిల్‌కుమార్‌ను ప్రత్యర్థులు హత్య చేశారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు.. ఇక, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. స్థానిక సీఐ, ఎస్‌ఐని సస్పెండ్ చేసింది..
సీబీఐ తీరుపై సుప్రీం ఆగ్రహం.. కీలక ఆదేశాలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేవకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. విచారణ అధికారిని మార్చాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది.. వివేకా హత్యకేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం… స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు.. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని నిలదీసింది.. విచారణ అధికారిని మార్చాలని ఆదేశాలు ఇచ్చింది.. స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసిన రాజకీయ వైరం అని మాత్రమే రాశారని మండిపడ్డ కోర్టు.. విస్తృతస్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్టు లేదని అసహనం వ్యక్తం చేస్తూ.. తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది.
వైరల్‌గా మారిన ఎమ్మెల్యే రాపాక వీడియో.. దొంగ ఓట్లతోనే గెలిచా..
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. దీంతో.. మరోసారి వైరల్ గా మారిపోయింది రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో.. అయితే, గతంలో తాను సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే రాపాక.. చింతలమోరి గ్రామంలో నా ఇంటి వద్ద పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు పడేవన్నారు.. నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేసేవారు.. దీంతో, చింతలమోరి గ్రామంలో నాకు మెజారిటీ ఏడు నుంచి ఎనిమిది వందల వరకు వచ్చేదంటూ.. అదేదో గొప్ప కార్యం అయినట్టుగా చెప్పుకొచ్చారు. కాగా, ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.. గతంలో చింతలమూరి గ్రామ సర్పంచ్ గా పనిచేశారు రాపాక, నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తనకు పది కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిదంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన వీడియో వైరల్‌గా మారగా.. మరోవైపు.. దొంగ ఓట్లతోనే తాను గెలిచానంటూ ఆయన పేర్కొన్న వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే, ఇటీవల వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రాపాక ఉత్సాహంతో మాట్లాడారు… అదే సమయంలో నోరుజారి తాను సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని చెప్పుకొచ్చారు.. ఓవైపు టీడీపీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. దీంతో అంతర్వేదిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యల వీడియోలను ఎవరో కావాలనే ఒక్కొక్కటిగా వైరల్ చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు బయటపెట్టినా.. ఎవరు వైరల్ చేసినా.. ఎమ్మెల్యే రాపాక ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. కాగా, గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత వైసీపీకి దగ్గరైన విషయం విదితమే.
భూవీకి షాక్ ఈ లిస్ట్ ను తొలగింపు
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత క్రికెట్ నియంత్రణ మండలి బిగ్ షాక్ ఇచ్చింది. తమ వార్షిక కాంట్రాక్ట్ జాబితా నుంచి భువనేశ్వర్ ను బీసీసీఐ తొలగించింది. బీసీసీఐ తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ లిస్ట్ లో భువనేశ్వర్ కుమార్ కు చోటు దక్కలేదు.. భువీతో పాటు సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్ శర్మకు కూడా తమ కాంట్రాక్ట్ లను కోల్పోయారు. కాగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న భువనేశ్వర్ ను భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. గతేడాది ఆసియా కప్ నుంచి భువీ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. ఆసియా కప్-2022 ఆఫ్ఘానిస్తాన్ పై మినహా అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ భువీ చేయలేదు. అదే విధంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లోనూ కూడా పేసర్ భువనేశ్వర్ కుమార్ విఫలమయ్యాడు. అనంతరం టీ20 ప్రపంచకప్ లో కూడా తన చెత్త ఫామ్ ను భువనేశ్వర్ కుమార్ కొనసాగించాడు. ప్రపంచకప్ లో ఆరు మ్యాచ్ లు ఆడిన భువీ కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో అయితే రెండు ఓవర్లు వేసిన భువనేశ్వర్ ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ నుంచి భువీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక భువీ తన వార్షిక కాంట్రాక్ట్ కూడా కోల్పోవడంతో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు. భువీ ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. అతడు ఇప్పటికే ఎస్ఆర్హెచ్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు.
ఈ ట్వీట్ కోసం కదా ఇంతసేపు వెయిట్ చేసింది
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్ని రికార్డులు బద్దలయ్యయో, ఎన్ని అవార్డులు వచ్చాయో, ఇండియన్ సినిమా ఎంత సాదించిందో అనే విషయాలని పక్కన పెడితే ఈ జనరేషన్ బిగ్గెస్ట్ మాస్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లని ఒక చోటకి తీసుకోని రావడంలోనే ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ సక్సస్ ఉంది. దశాబ్దాలుగా రైవల్రీ ఉన్న ఫ్యామిలీల నుంచి వచ్చిన ఇద్దరు మాస్ హీరోలు ఒక సినిమాలో నటించడం అనేది చిన్న విషయం కాదు. మరీ ముఖ్యంగా అభిమానుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చరణ్-ఎన్టీఆర్ లు కలిసి సినిమా చెయ్యడం అనేది బిగ్గెస్ట్ రిస్క్. ఆ రిస్క్ ని చరణ్, ఎన్టీఆర్ లు ఎలాంటి లెక్కలు వేసుకోకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమా చెయ్యడానికి కారణం ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహమే. చరణ్, ఎన్టీఆర్ లు చాలా మంచి ఫ్రెండ్స్, ఆర్ ఆర్ ఆర్ సినిమా కన్నా ముందు నుంచే మంచి స్నేహితులు కాబట్టి ఆ బాడింగ్ తెరపైన, ప్రమోషన్స్ లో కనిపించింది. ఇద్దరు టాప్ హీరోలు ఇంత స్నేహంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే రేంజులో చరణ్-ఎన్టీఆర్ కలిసి కనిపించారు. అయితే ఇదంతా ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కోసం మాత్రమే అని కామెంట్స్ చేసే వర్గానికి చెందిన ఆడియన్స్ కూడా ఉన్నారు. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా చరణ్, ఎన్టీఆర్ లు మాత్రం ఒకరిని ఒకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఆర్ ఆర్ ఆర్ సినిమాని గ్లోబల్ స్టేజ్ లో నిలబెట్టారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాకి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయ్యాయి, ఇకపై చరణ్-ఎన్టీఆర్ లు కలిసి కనిపిస్తారా లేదా అనే ఆలోచన మెగా నందమూరి అభిమానులతో సినీ అభిమానులందరిలోనూ ఉంది. అందుకే రామ్ చరణ్ పుట్టిన రోజు అయిన ఈ రోజున ఎన్టీఆర్ నుంచి ట్వీట్ వస్తుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ఎన్టీఆర్, చరణ్ కి ఎప్పుడు విష్ చేస్తాడా అని వెయిట్ చేసిన మ్యూచువల్ ఫాన్స్ కి గిఫ్ట్ ఇస్తూ ఎన్టీఆర్ “హ్యాపీ బర్త్ డే మై బ్రదర్, హ్యావ్ ఏ బ్లాస్ట్” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుత మెగా నందమూరి అభిమానులంతా ఎన్టీఆర్ ని రీట్వీట్ చేసే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ ట్వీట్ తో పాటు చరణ్ తో ఉన్న ఒక ఫోటోని కూడా పోస్ట్ చేసి ఉంటే ఇంటర్నెట్ అంతా షేక్ అయ్యేది.
సీమ కుర్రాడు గ్లోబల్ స్టార్ ని రంగంలోకి దించబోతున్నాడా?
గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటకి వచ్చి హిట్ ట్రాక్ ఎక్కాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. మాస్ ఇమేజ్ కోసం కెరీర్ స్టార్టింగ్ నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఈ సీమ కుర్రాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. జనవరిలో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన కిరణ్ అబ్బవరం మళ్లీ ఏప్రిల్ 7న ‘మీటర్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. మొదటిసారి పోలిస్ పాత్రలో నటిస్తున్న కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాతో మాస్ మీటర్ పెంచుతాననే కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ని కలిశాడు. చరణ్ ని కిరణ్ అబ్బవరం కలిసిన ఫోటోలని మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి కిరణ్ అబ్బవరం, చరణ్ ని క్యాజువల్ గానే కలిసాడా? లేకుంటే మీటర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా పిలవడం కోసం కలిసాడా అనేది చూడాలి. ఇటివలే మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దాస్ కా ధమ్కీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ని రంగంలోకి దించాడు. దీంతో తారక్ ఫాన్స్ అంతా దాస్ కా ధమ్కీ సినిమాకి సపోర్ట్ చెయ్యడంతో విశ్వక్ సేన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేసాడు. ఇదే బాటలో కిరణ్ అబ్బవరం కూడా ముందుకి వెళ్లి రామ్ చరణ్ ని ‘మీటర్’ సినిమా ఈవెంట్ కి ఇన్వైట్ చేస్తే మెగా అభిమానుల సపోర్ట్ యంగ్ హీరోకి దొరికే అవకాశం ఉంది. మరి మేకర్స్ ఆలోచన ఎలా ఉందో చూడాలి.