సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 10 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. సంక్రాంతి సందర్భంగా ఈనెల 7, 22 తేదీల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 7, 14వ తేదీల్లో కాచిగూడ-విశాఖపట్నం, 8, 16 తేదీల్లో విశాఖపట్నం-కాచిగూడ, 11న కాచిగూడ – నర్సాపూర్, 12న నర్సాపూర్- కాచిగూడ, 19, 21 తేదీల్లో కాకినాడ టౌన్- లింగంపల్లి, 20, 22 తేదీల్లో లింగంపల్లి – కాకినాడ టౌన్ మధ్య స్పెషల్ రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్ల వివరాలు
★ కాచిగూడ -విశాఖ స్పెషల్ రైలు రాత్రి 9 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:15 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉ.8 గంటలకు కాచిగూడ చేరనుంది. ఈ రైలు మల్కాజ్గిరి, చర్లపల్లి, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.
★ కాచిగూడ- నర్సాపూర్ స్పెషల్ రైలు రాత్రి 11:15 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటిరోజు ఉ.9:40 గంటలకు నర్సాపూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉ.9:40 గంటలకు కాచిగూడ చేరనుంది. ఈ రైలు మల్కాజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగనుంది.
★ కాకినాడ టౌన్- లింగంపల్లి స్పెషల్ రైలు రాత్రి 8:10 గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటిరోజు ఉ.8:30 గంటలకు లింగంపల్లి చేరుతుంది. తిరుగుప్రయాణంలో సా.6:40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి మరుసటిరోజు ఉ.6:50 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుంది. ఈ రైలు సామర్లకోట, రాజమంత్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
10 Sankranti Special Trains between various destinations#Sankranthi2022 #specialtrains pic.twitter.com/Ohzify0irc
— South Central Railway (@SCRailwayIndia) January 1, 2022