తెలంగాణలో ఓమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం మాస్కులు వాడని వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా జరిమానాల జాతర మొదలైంది. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకున్నా, డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడ్డా చలానాలు రాస్తున్నారు. ఇప్పుడేమో కోవిడ్ తీవ్రత పెరగడంతో మళ్ళీ జరిమానాలు మొదలయ్యాయి. భద్రాచలంలో మాస్కుల జరిమానాలు షురూ అయ్యాయి. భద్రాచలంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 10 మందికి 10 వేలు జరిమానా విధించారు ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీపతి తిరుపతి.

దేశంలో ఓమిక్రాన్ అలజడి రేగడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు పలు సూచనలు చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టం చేశారు. మాస్క్ ధరించకపోతే పోలీసులు రూ. వెయ్యి జరిమానా విధిస్తారని తేల్చిచెప్పారు. మాస్కు ధరించడంతోపాటు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. . ఒమిక్రాన్ నివారణకు తమ వంతు ప్రయత్నం చేయాలని.. జాగ్రత్తలు పాటించకపోతే ఇప్పుడు జరుగుతున్న అసత్య ప్రచారాలే వాస్తవాలు అవుతాయని సీఎం కేసీఆర్ కూడా హెచ్చరించారు.
ఇదిలా వుంటే …ఒమిక్రాన్ కేసుల పై తొలిసారి బులిటెన్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇవాళ 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇప్పటిదాకా మొత్తం 13 పాజిటివ్ కేసులు వుండగా, జీనోమ్ సీక్వెన్స్ కు 13 కేసులు పంపింది ప్రభుత్వం.