ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తూనే ఉంది… మూడు ఫిర్యాదులు, ఆరు లేఖలు అన్నచందంగా ఈ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది.. తాజాగా, మరో కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి మరో లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. ఇక, ఈ సారి లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. సెంట్రల్ వాటర్ కమిషన్ 1981లో బనకచెర్ల వద్ద కేవలం ఒక్క క్రాస్ రెగ్యులేటర్ కు మాత్రమే అనుమతించిందని గుర్తుచేశారు.. ఎస్కేప్ రెగ్యులేటర్ అనేది తరువాతి కాలంలో అనుమతి లేకుండా నిర్మించారని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. అనుమతిలేకుండా శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 20,000 క్యుసెక్కులకు పెంచారని లేఖలో పేర్కొన్న ఇరిగేషన్ ఈఎన్సీ.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరద జలాలను +880 ఫీట్ల లెవల్ పైన నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే 11,150 వరకు విడుదల చేయడానికి డిజైన్ చేయబడిందని తెలిపారు.
ఎస్‌ఆర్‌బీసీ చెన్నై తాగునీటికై వరద సమయాల్లో జులై నుండి అక్టోబర్ మధ్య మాత్రమే నీటిని వదలాలని గుర్తుచేసింది ఈఎన్సీ.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 34 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని విడుదల చేయడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేదని.. వెంటనే నీటి విడుదల ఆపివేయాలని కోరింది.. గెజిట్ నోటిఫికేషన్ లో షెడ్యూల్ 2లో అనుమతించిన ప్రాజెక్టులుగా పేర్కొన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ఎస్‌ఆర్‌ఎంసీ కాలువ, ఎస్కేప్ రెగ్యులేటర్, తెలుగు గంగా ప్రాజెక్టు రెగ్యులేటర్లను అనుమతిలేని ప్రాజెక్టులుగా పేర్కొనాలని లేఖలో పేర్కొంది. శ్రీశైలం ప్రాజెక్టును హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుగానే కృష్ణా ట్రిబ్యునల్ పరిగణించింది.. 19 టీఎంసీలను ఎస్‌ఆర్‌బీసీ ప్రాజెక్టుకు, 15 టీఎంసీలు చెన్నై తాగునీటికై, మొత్తం 34 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుంచి మల్లించవచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చిందని లేఖ ద్వారా కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.