తనకు పడక సుఖాన్ని ఇవ్వలేదని భార్యను అతి దారుణంగా భర్త హత్య చేసిన ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. ఒక నెల బాలింత అయిన భార్యను తన కోరిక తీర్చాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కనికరం లేకుండా గొంతునులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు.. పోస్టుమార్టం రిపోర్ట్ తో అసలు విషయం బయటపడింది..
వివరాల్లోకి వెళితే..నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారుకొండ ప్రాంతం అగ్రహారం తండాకు చెందిన జటావత్ తరుణ్, ఝాన్సీ ప్రేమించుకుని 2021లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. నగరానికి వచ్చి ఐఎస్ సదన్ డివిజన్ ఖాజాబాగ్‌లోని మదర్సా అష్రఫ్ ఉల్ ఉలూం పరిసరాల్లో నివసించసాగారు. తరుణ్ ఆటోడ్రైవర్. వీరికి రెండేళ్ల కుమారుడున్నాడు. గత ఏప్రిల్ 16న కూతురు పుట్టింది. మే 20న అర్ధరాత్రి భార్యతో తరుణ్ తన కోరికను వెల్లడించారు.. అయితే ఆమె నీరసంగా ఉందని అందుకు నిరాకరించింది..
కోపంతో రగిలిపోయిన తరుణ్ భార్యను బలవంతం చేస్తుండటంతో ఆమె కేకలు వేసేందుకు ప్రయత్నించింది. దీంతో తరుణ్ తన కుడిచేతితో ఆమె తలను మంచంపై అదిమి పెట్టాడు. ముక్కు, నోటి మీద అరచేతిని కొంతసేపు అలాగే ఉంచడంతో ఆమెకు శ్వాస ఆడలేదు.. దాంతో ఆమె నోటిలో నుంచి నురగ రావడంతో తమ బంధువులకు చెప్పాడు..వారంతా కలిసి హుటాహుటిన కంచన్‌బాగ్‌లోని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించి పోలీసులకు సమాచారమివ్వగా వారు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి శవపరీక్షకు తరలించారు. ఝాన్సీ తండ్రి నెనావత్ రేఖ్యా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.. పోస్టుమార్టం రిపోర్ట్ రావడంతో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగ అసలు విషయాన్ని చెప్పాడు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.. ఇద్దరు పసికందులు అనాధలు అయ్యారు..