యాసంగిలో వరి పంట వేయాలా? వద్దా? అనే గందరగోళ పరిస్థితి నెలకొంది.. ఎందుకంటే.. ఇప్పటికే మార్కెట్లకు చేరిన పంట.. కల్లాలు, రోడ్లపై ఉన్న పంట కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారే నడిచింది.. ఇక, తాజాగా యాసంగిలో వరి పంట వేయొద్దంటూ కేంద్రం కూడా స్పష్టంగా చెప్పేసింది.. దీంతో.. యాసంగిలో వరి పంట వేయొద్దు అంటూ క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. పౌర సరఫరాల శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులు హాజరు కాగా.. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. యాసంగిలో వరి పంట వేయొద్దు అని స్పష్టం చేశారు.
పారా బాయిల్డ్ బియ్యం కొనమని ఎఫ్‌సీఐ స్పష్టం చేసిందని గుర్తుచేశారు సీఎస్ సోమేష్ కుమార్.. యాసంగిలో పండే వరి బాయిల్డ్ రైస్ కు మాత్రమే పనికి వస్తుంది.. రైస్ మిల్లర్లతో, సీడ్ కంపెనీలతో ఒప్పందం ఉన్న వాళ్లే వరి పంట వేసుకోవచ్చు అని తెలిపారు.. వరి పంట సొంత రిస్క్ తో వేసుకోవచ్చు అన్నారు. ఇక, వానా కాలం పంటను కొనేందుకు అవసరం అయితే కొనుగోలు కేంద్రాలు పెంచాలని సూచించిన ఆయన.. కలెక్టర్‌లు ఎక్కడా సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి.. ప్రోక్యూర్ మెంట్ సెంటర్ లను విజిట్ చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకి ధాన్యం రాకుండా నియంత్రించాలి.. వానా కాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తీసుకుంటామని ఎఫ్‌సీఐ చెప్పిందన్నారు సీఎస్ సోమేష్ కుమార్.