తెలకపల్లి రవి : తెలంగాణ ఉద్యమంలో ప్రొ.జయశంకర్ ప్రత్యేక ముద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాము పూర్తిగా ఏకీభవించని వారినెవరినైనా ఇతరులు గౌరవిస్తున్నారంటే అది వారి వ్యక్తిత్వానికి ప్రతీక. ప్రొఫెసర్ జయ శంకర్ అక్షరాలా అలాంటి వ్యక్తి. అరవై ఏళ్లపాటు ఒకే మాటకు బాటకు కట్టుబడి నిస్వార్థంగా నిష్కల్మషంగా నిలబడ్డారు. తెలంగాణా విముక్తికి మొదటి తరంలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి వారు ప్రతీకలైతే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు తర్వాత కాలంలో ఆ ప్రాంత సమస్యలకు ఆయన ప్రతిధ్వని అయ్యారు. అది పదవులతో ప్రచారాలతో సంబంధం లేని భావాత్మక ప్రాతినిధ్యం. అనుకున్నది జరక్కపోయినా ఆకాంక్షకే కట్టుబడిన దృఢమైన ప్రాతినిధ్యం. విద్యా రంగంలో వున్నతమైన బాధ్యతలు నిర్వహించినా రాజకీయ నేతలకు గురుపీఠంలో భాసించినా జయ శంకర్ నిబద్ధంగా నిరాడంబరంగా సంచరించారు. తనకు చాలా ఇష్టమైన మాటల్లో చెప్పాలంటే చెన్నారెడ్డి నుంచి చిన్నా రెడ్డి వరకూ రకరకాలైన రాజకీయ పాత్ర ధారులు మారారు గాని తాను సూత్రధారిగానే వుండిపోయారు.వచ్చీ పోయే నౌకలకు దారి చూపిస్తూ వుండిపోయే దీపస్తంభమే అయ్యారు.ఆయన ఆలోచనలను అన్ని వేళలా అందరూ ఒప్పుకుని వుండకపోవచ్చు గాని ఆయన అంకిత భావం, అధ్యయన శీలత, ఆచరణకు ప్రాదాన్యత నివ్వడం, ఆడంబరాలకు అట్టహాసాలకూ దూరంగా వుండటం ఇవన్నీ ఆదర్శప్రాయమైనవి.
read more : మమతా సర్కార్‌కు హైకోర్ట్ షాక్…
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
నాయకత్వం అనేక విధాల పట్టుపడుతుంది. భూస్వామ్య సంప్రదాయాలు గల దేశాల్లో కుటుంబ వారసత్వం వొక మార్గం. పదవుల వల్ల, పై నుంచి ఆమోదం వుండటం వల్ల, ఒకానొక చారిత్రిక సన్నివేశం వల్ల మనుషులు నాయకులవువుతుంటారు. కాగా తమ నైతికతతోనూ జ్ఞాన సంపదతోనూ పట్టుదలతోనూ పోరాట పటిమతోనూ మరికొందరు నాయకత్వ పాత్ర పోషించగలుగుతారు. అధికార పూర్వకమైన నాయక స్థానాలలో మార్పులు చేర్పులుంటాయి గాని నైతిక సైద్ధాంతిక కారణాల వల్ల లభించే నాయకత్వాలు అలా కాదు. వర్తమాన తెలంగాణా రాజకీయ దృశ్యంలో జయ శంకర్‌ది అలాటి నైతిక నాయకత్వమే. అది బలం బలహీనత కూడా.బలం ఏమిటంటే ఆటు పోట్లకు అతీతంగా కొనసాగడం.బలహీనత ఏమంటే తమ భావ పరివ్యాప్తికి ఎవరిపైనైనా ఆధారపడవలసి రావడం.
నాయకుడు ఎవరైనా నేను నా భావాల విస్తరణకే ూపయోగించుకున్నానని ఆయన తరచూ చెబుతుండేవారు. అయితే ఈ ఉపయోగించుకోవడం అనేది రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. ఈ సంగతి తెలుసు కనకే వీలైనంత వరకూ ప్రత్యక్ష పదవులకు దూరంగా మసిలారు. 1969 ఉద్యమం తర్వాత చెన్నారెడ్డి తనను ఎన్నికల్లో పోటీ చేయమని పిలిస్తే నిరాకరించానని,అలా చేసి వుంటే తను కూడా ఒక మదన్ మోహన్ లాగా మిగిలిపోయేవాడినని ఆయన ఒకసారి ఈ రచయితతో మాట్లాడుతూ అన్నారు. దాదాపు గంట సేపు రాష్ట్ర రాజకీయాలకు, వ్యక్తులకు సంబంధించి వివిధాంశాలపై జరిపిన చర్చ ఆయన అవగాహన విస్త్రతికి అద్దం పట్టిందనే చెప్పాలి.అప్పటికే ఆయన అనారోగ్యం వృద్ధాప్య భారాలతో కాస్త మెత్తగా వున్నారు.
1952కు ముందు తెలంగాణా ప్రతేక రాష్ట్ర వాదన వుండేది కాదని సుందరయ్య రాశారు. తర్వాత కూడా ప్రత్యేక రాష్ట్రం కోరిన వారిలో భిన్న తరహాలకు చెందిన వారున్నారు. తరాలకు చెందిన వారున్నారు. 1954లో ఫజల్ అలీ కమిటీ దగ్గరే ప్రత్యేకంగా వుండాలని జయశంకర్ మెమోరాండం ఇచ్చారంటే మొదటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు ఆయన వ్యతిరేకంగానే వున్నారనేది స్పష్టం. ఫజల్ అలీ సిఫార్సులపైన వాటి అమలుపైన అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఆనాడు దానికి మెమోరాండాలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు పలువురు తర్వాత తమ వైఖరి మార్చుకున్నారు. ఉదాహరణకు ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుపై హడావుడి వద్దని అంతకన్నా ముందే దస్త్రం సమర్పించిన నీలం సంజీవరెడ్డి తర్వాత తనే మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. మర్రి చెన్నారెడ్డి, కె.వి.రంగారెడ్డి వంటివారు మంత్రులయ్యారు. తమ రాజకీయ భవితవ్యాలు మారగానే ప్రత్యేక మంత్రం చేపట్టి మళ్లీ మానుకున్నారు. ఆ దశలో జయ శంకర్ వారికి మద్దతుగా నిలిచి తర్వాత నిరుత్సాహానికి గురైనారు.
ఇక వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలోనూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ప్రత్యేక రాష్ట్ర పల్లవి ఆలపించి సోనియా గాంధీకి మెమోరాండం ఇచ్చినప్పుడు వారితోనూ జయ శంకర్ వుండి విషయ పుష్టి కలిగించేందుకు కారకులైనారు. అంతకు ముందు కాలంలో విభజన ూద్యమానికి 90 ల తర్వాతకూ తేడా ఏమంటే అస్తిత్వ రాజకీయాలకు అంతర్జాతీయంగా ప్రోత్సాహం పెరగడమే. ఆ పదం వాడినా వాడక పోయినా మొదటి నుంచి ఆ తరహాకు చెందిన ఆలోచనలు కలిగిన జయ శంకర్ వంటి మేధావులకు ఈ వాతావరణం కూడా బాగా దోహదం చేసింది. ఈ ప్రాంతంలో వెనకబాటు గురించి, అసమానతలు లేదా తాము అనుకునే వివక్షల గురించి సమాచార తాత్విక భూమిక ఏర్పాటుచేయడం అవసరమని వారు గుర్తించారు. ప్రపంచీకరణ విధానాల ఉధృతితో పెరిగిన సమస్యలను ప్రాంతీయ కోణాన్ని మేళవించి విస్త్రతమైన అధ్యయన ప్రచార కార్యక్రమాలను తలపెట్టారు. దీని ఫలితమేమంటే అప్పటి వరకూ పాలక వర్గ రాజకీయ వేత్తల పాచికలకే పరిమితమైన ప్రత్యేక రాష్ట్ర ూద్యమం ఒక సిద్ధాంత రూపం తీసుకున్నది.
తాను సిద్ధాంత కర్తనని జయ శంకర్ ఒప్పుకోకపోయినప్పటికీ ఈ కోణంలో ఆయన చిరకాల భావాలు అస్తిత్వ సిద్దాంతాలకు అచ్చంగా సరిపోయాయి. కె.సి.ఆర్ 2000 తర్వాత తెలుగు దేశం నుంచి వైదొలగాక, ప్రత్యేక రాష్ట్ర నినాదం తీసుకుని టిఆర్‌ఎస్ ఏర్పాటు చేశాక సహజంగానే జయ శంకర్ దానికి భీష్మ పితామహుడుగా మారాడు. భారతంలో భీష్ముడి పాత్ర పూర్వాపరాలు సుప్రసిద్ధమైనవే. విద్యుదుద్యమ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తి 2004లో కాంగ్రెస్ టిఆర్‌ఎస్ కూటమి అధికారంలోకి వచ్చింది. తర్వాత వైఎస్ వైఖరి ఎలా మారిందీ రెండు చోట్ల రెండు రకాల ఎలా మాట్లాడిరదీ ఎవరూ కాదనలేని సత్యం.మరోవైపున ఆయనతో మమేకమైనట్టు కనిపించే పార్టీలైనా సరే ఆయన చెప్పిన ప్రతిదీ అమలు చేశాయని గాని చేయగలవని గాని అనుకోవడం కష్టం. భావాత్మక రాజకీయాలకూ వ్యూహాత్మక రాజకీయాలకూ తేడా అక్కడే వస్తుంది.
అలాటి తేడాలు ఎన్ని వున్నా ఆ రేఖలకు అతీతంగా ఆయన వ్యక్తిత్వాన్ని అందరూ గౌరవించడమే గొప్ప విశేషం. ఎందుకంటే ప్రొఫెసర్ జయ శంకర్ అనుకున్న అవగాహనకు ప్రాధాన్యత నిచ్చారే గాని అసహనానికి కాదు. అదే సంయమనం, చర్చా సంప్రదాయం కొనసాగించడం ప్రజాస్వామిక పరిష్కారాలకు మార్గం సుగమం చేస్తుంది. 2011లో ఆయన మరణించేప్పటికే కేంద్ర ప్రకటనలూ, కమిటీలు వంటివన్నీ జరిగాయి.తెలంగాణ ఏర్పాటు జరుగుతుందన్న విశ్వాసంతోనే కన్నుమూశారు. ఇప్పుడు ఆయన అసలైన వారసులం మేమంటే మేమని ఎవరు చెప్పుకున్నా తెలంగాణ రాష్ట్రం అన్న భావనలోనూ భౌగౌళిక రూపంలోనూ జయశంకర్ కనిపిస్తుంటారు.ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణాధీశుడైన ఆ భావనకు ప్రతీకగా ప్రొఫెసర్ జయశంకర్ నిలిచివుంటారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!