ఏపీ విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ఘనంగా ప్రకటించబడిన పోలవరం కేంద్రం వివక్షతో సమస్యాత్మకంగా నడుస్తుంటే జరిగినమేరకు పనులు కూడా ప్రజల పాలిట ప్రాణాంతకమవుతున్నాయి. పెరిగిన వ్యయాన్ని లెక్కలోకి తీసుకోకపోవడం ఒకటైతే ప్రాథమిక సూత్రమైన సహాయ పునరావాస కార్యక్రమాలకు బాధ్యత లేదని దులిపేసుకోవడం కేంద్రం చేస్తున్న దారుణం. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పునరావాసపనులు సరిగ్గా జరగలేదని తాము అధికారంలోకి రాగానే పటిష్టంగా ఆదుకుంటామని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పదేపదే ప్రకటించారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో స్వయంగా ప్రధాని మోడీనే పోలవరం నిర్మాణం అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. తర్వాత ఆయన మళ్లీ ప్రధాని అయ్యారు, జగన్ ముఖ్యమంత్రి అయ్యారు గాని పోలవరం వెతలు మాత్రం తీరలేదు.. సరికదా తీవ్ర మానవ సంక్షోభంగా మారుతున్నాయి, కఫర్‌డాం ఘనంగా కట్టేసిన కారణంగా వర్షాలు పెద్దగా కురవకపోయినా సరే నీళ్లు ముంచేస్తున్నాయి.
ఫలితం లేని వినతులు
నిర్మాణ వ్యయం మాత్రమే అది కూడా 2014 నాటిలెక్కల ప్రకారం 22 వేల కోట్లు అది కూడా ముందు రాష్ట్రం ఖర్చు చేసిన తర్వాత మాత్రమే తాము విడుదల చేస్తామని కేంద్రం చాలాసార్లు ప్రకటించింది. ఏ ప్రాజెక్టు కట్టినా ముందు పునరావస కల్పన జీవనోపాధి పునరుద్ధరణ జరిగాకే జరగాలని సుప్రీంకోర్టుతో సహా న్యాయస్థానాలు అనేక సార్లు చెప్పి వున్నాయి. ఈ అంశంపై కేంద్రంలోని మోడీ సర్కారు కావాలనే వంకరటింకరవాదనలతోచేతులు దులిపేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియా ప్రియత్వం వహిస్తున్నది. అడపాదడ వినతులతో సరిపెడుతున్నది. గత నెలలోనే ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు. కేంద్రం నుంచి ఈ విషయంలో రావలసిన సహాయం రావడం లేదనేది వాస్తవం. ప్రజలకు చెప్పి ప్రతిపక్షాలను కలుపుకొని వొత్తిడి పెట్టె బదులు టిడిపి, వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంలో మునిగితేలుతున్నాయి. 55 వేల కోట్లకు పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపును తాము ఆమోదింపచేసుకుంటే ఈ ప్రభుత్వ హయాంలో వెనక్కు పోయిందని టిడిపి చాలా కాలం విమర్శించింది. అయితే తర్వాత జల్‌శక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అధారిటీ(పిపిఎ) ఈ పెరిగిన ఖర్చుకు ఒప్పుకున్నట్టు అది తమవిజయమైనట్టు వైసీపీ నేతలు చెప్పుకున్నారు. అందులోభాగంగా కొన్ని వందలకోట్లు విడుదల చేస్తే అదో ఘనతగా చూపించుకున్నారు. అసలు సమస్యగా వున్న పునరావాసం దాటేస్తున్నారు. ప్రచారార్భాటంతో పర్యటనలకు వెళ్లి ప్రతిపక్షంపై సవాళ్లు విసిరే మంత్రులు అనిల్‌కుమార్ వంటివారు దీనిపై మాట్లాడకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చేసి అంతా అయిపోయినట్టే అభినయిస్తారు.
9 గ్రామాలకే దిక్కులేదు,అన్నీఖాళీ అయితే?
ఈ ప్రాజెక్టు నిర్మాణం, నీటినిల్వ ప్రవాహం కారణంగా 275 గ్రామాలలో 1,07 లక్షల కుటుంబాలు నిర్వాసితమవుతాయి. లక్షాముప్పై వేల ఎకరాలు మునిగిపోతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలు, తూర్పుగోదావరిజిల్లాలో పోలవరం, దేవీపట్నం, అంగలూరు, వరరామచంద్రాపురం(విఆర్‌పురం) చింతూరు, ఏటపాక, కూనవరం మండలాలు మునిగిపోతాయి. ఇందులో దేవీపట్నం పోలవరం మినహా మిగిలిన మండలాలన్ని తెలంగాణ నుంచి బదలాయించబడినవే. కఫర్‌డ్యాం ఎత్తు పెంచాలనీ, వీలైతే దానిద్వారా ముందే నీళ్లు ఇవ్వాలని ఉత్సాహపడిన సర్కార్లు ఫలితంగా సంభవించే ముంపుబాధితుల గోడు మాత్రం పట్టించుకోలేదు. అరకొర పునరావాసం కల్పించింది మాత్రం కేవలం 9 గ్రామాలలో 3300 కుటుంబాలకు మాత్రమే. ఇది మూడు శాతం కూడా కాదు. విద్యుత్ పనుల కోసం మరో 60 గ్రామాలవారిని బలవంతాన అక్కడినుంచి తొలగించినంత పనిచేశారు. ఇక 41.15 కాంటూరు పరిధిలోకి వచ్చే 90 గ్రామాలు ఖాళీ చేయించాలని ప్రభుత్వం వత్తిడి చేస్తున్నది. ఇప్పుడు నిల్వ చేసిన నీటిని వదలడానికి స్పిల్‌వే గేట్లు ఉపయోగిస్తున్నారు. రేపు ఆ గేట్లు మూసేస్తే మొత్తంవూళ్లూ మునిగిపోతాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఉపాధి కల్పించాలి. కాని గిరిజనుల పోడు భూములకు పట్టాలు లేవనే సాకుతో పరిహారమే ఎగవేశారు, ఇదిగాక 39 సదుపాయాలతో ప్రత్యామ్నాయ గృహనిర్మాణం ప్రభుత్వాల నిర్మాణ సంస్థలబాధ్యత. చంద్రబాబు ఎకరాకు 1.25 లక్షల చొప్పున ఇచ్చిన ప్యాకేజీ సరిపోదని తామువస్తే 10లక్షలు ఇచ్చి పంపిస్తామని జగన్ హామీ ఇచ్చారు, ఇప్పటికీ సమీక్షలలో చెబుతుంటారుగాని ఇచ్చింది లేదు.
నిబంధనల ఉల్లంఘన, అర్హులకు అన్యాయం
ఇక అర్హుల విషయమే చూస్తే గతంలో అనర్హులను చేర్చడం వల్ల దాన్నిసాకుగా చూపి బాధితులకు కూడా అన్యాయం చేశారు పాలకులు. వాస్తవానికి ఆ సంఖ్య పెరుగుతున్నది. 2017ను కొలబద్దగా తీసుకుని 18 ఏళ్లు పైబడినవారు 1.25 లక్షల మంది వున్నారని లెక్కవేశారు. 2021 నాటికి పూర్తికాని పనులతో ఆ సంఖ్య 5 లక్షలు దాటింది. నిర్వాసితులకోసం కట్టిన కాలనీలు లోపభూయిష్టంగా ఎలాంటి వసతులు లేకుండా కాస్తవానకే కారుతూ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి, ఏకంగా 30లక్షల ఇళ్లు కట్టి పండుగ చేస్తానంటున్న సర్కారు ముంపు ప్రాంతాల్లో ఎందుకుకట్టడం లేదు? గిరిజనులకు షెడ్యూలు ప్రాంతాలలోనే పునరావాసం కల్పించాలి గాని నాన్‌షెడ్యూల్ ప్రాంతాలకు తరలించి తంతు పూర్తి చేయడం మరో రాజ్యాంగ విరుద్ధ చర్య. ఇక్కడ దాదాపు 60 శాతం గిరిజనులే. ఇవన్నీగాక మానవ హక్కుల సమస్యలు కూడా వున్నాయి. ఉదాహరణకు ముంపు వచ్చేలోగా సరుకులు తీసుకుపోవడానికి టేకూరు వాడపల్లి తూటూరు వంటి గ్రామాల నుంచి ఏలూరు వచ్చిన ప్రజలను తిరిగి వారి గ్రామాలకు పోనీకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇటీవల అఖిలపక్ష నాయకులు ఆ గ్రామాలలో పరిశీలనకు వెళ్లినప్పుడు నిర్వాసితులు చెప్పిన వాస్తవాలు హృదయవిదారకంగావున్నాయి. వాటిపై విజయవాడలో దీక్షలకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ నిర్బంధించి రాకుండాచేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పుండుమీద కారం రాసింది. కేంద్రం జాతీయప్రాజెక్టు అంటూనే పోలవరం నిర్మాణ నిధులు పునరావాస వ్యయం విడుదల చేయకపోవడం బాధ్యతా రాహిత్యమే. వ్యవసాయం నిలిచిపోయి పంటలూ పనులు లేక ఆ ప్రజలు గోడుపెడుమంటున్న నేపథ్యం మరింత దారుణంగా వుంది. కేంద్రంతో పోరాడి 33 వేల కోట్ల నిధులు తక్షణం రాబట్టి కనీసవసతులతో కాలనీలు నిర్మించి వారిని తరలించకపోతే తీవ్ర అసంతృప్తికి గురి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ప్రత్యేకహోదాకు ఎగనామం. లోటు భర్తీకి మంగళం.. రాజధానికి రిక్తహస్తం.. విశాఖ ఉక్కు బేరం.. వంటి కేంద్ర చర్యలు రాష్ట్ర ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి, ఏ ఒక్క అంశంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలనే ధోరణి మోడీ సర్కారులో లేకున్నా గట్టిగా అడిగే చేవ జగన్ సర్కారుకూ వుండటం లేదు. ప్రజల బాధలు విని సత్వర సహాయం పునరావాసం కల్పించడం కేంద్ర రాష్ట్రాల బాధ్యత. లేకుంటే వారి నిరసన అనివార్యం.