టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లకు 151/7 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ ముందు 152 పరుగుల టార్గెట్ నిలిచింది. బౌలింగ్ పిచ్ కావడంతో ఆరంభంలో పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత ఓపెనర్ రోహిత్ డకౌట్ కాగా మరో ఓపెనర్ రాహుల్ 3 పరుగులకే వెనుతిరిగాడు. ఈ రెండు వికెట్లు షహీన్ షా అఫ్రిదికే దక్కాయి.
అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13) కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. అతడి వికెట్‌ను హసన్ అలీ బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు, కోహ్లీ (57), రిషబ్ పంత్ (39) రాణించారు. పంత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన జడేజా ఆచితూచి ఆడాడు. జడేజా 13 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం పాండ్యా (11) రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చివరి మూడు ఓవర్లలో భారత్ 37 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు. హసన్ అలీ 2, షాదాబ్ ఖాన్ 1, హరీస్ రవూఫ్1 వికెట్ సాధించారు.