(జూన్ 30న నటదర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బర్త్ డే)
తెలుగు సినిమా రంగంలో ఎవరికైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా అప్పట్లో మదరాసులోని యన్టీఆర్ ఇంటి తలుపు తట్టేవారు. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు మారిన తరువాత ఆ స్థానాన్ని దాసరి నారాయణరావు ఆక్రమించారు. ఏ సమయంలో దాసరి ఇంటి తలుపు తట్టినా, తమకు న్యాయం జరుగుతుందని సినిమా రంగంలో ఎంతోమంది ఆశించేవారు. దాసరి ఉన్న రోజుల్లోనే అదే తీరున నేనున్నానంటూ చిత్రపరిశ్రమలోని కార్మికులను ఆదుకున్నవారిలో తమ్మారెడ్డి భరద్వాజ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. అలా అందరివాడు అనే పేరు సంపాదించిన భరద్వాజ, తెలుగు చిత్రసీమలో ఏ సమస్యవచ్చినా పరిష్కార మార్గం అన్వేషించేవారికి బాసటగా నిలిచేవారు. ఇప్పుడు కూడా అదే తీరున సాగుతున్నారాయన.
తన తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి చూపిన బాటలోనే పయనిస్తూ అందరికీ తలలో నాలుకలా మసలుకుంటున్నారు భరద్వాజ. నిర్మాతగా, దర్శకునిగా, నటునిగా భరద్వాజ జనాన్ని అలరించారు. తండ్రి రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మరపురాని చిత్రాలను అందిస్తే, భరద్వాజ తన చరిత చిత్ర పతాకంపై జనాన్ని మురిపించే సినిమాలను రూపొందించారు. చిరంజీవికి నటునిగా పేరు సంపాదించి పెట్టిన కోతలరాయుడు, మొగుడు కావాలి చిత్రాలను నిర్మించింది భరద్వాజనే. తరువాతి రోజుల్లో దర్శకునిగా అలజడితో ఆకట్టుకున్నారు. ఇక నేనేరా పోలీస్ చిత్రంలో నటునిగానూ మెప్పించారు. ఇలా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ సాగిన భరద్వాజ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయినా, సినీజనానికి మాత్రం ఆయన ఎప్పుడూ దగ్గరివాడే!
నిర్మాతగా, దర్శకునిగా తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన చిత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. మన్మథ సామ్రాజ్యం, నేటి దౌర్జన్యం, కడప రెడ్డెమ్మ, శివ-శక్తి, పచ్చని సంసారం, రౌడీ అన్నయ్య, బంగారు మొగుడు, కూతురు, అత్తా నీ కొడుకు జాగ్రత్త, సంచలనం, రామ్మా చిలకమ్మా, పోతే పోనీ, ప్రతిఘటన వంటి చిత్రాలు భరద్వాజ దర్శకత్వంలో రూపొంది జనం మెప్పు పొందాయి. కొన్ని చిత్రాలు పరాజయం పాలయినా, మరికొన్ని సినిమాల్లో భరద్వాజ దర్శకత్వ బాణీ ఆకట్టుకుంది. తాను ఓ వైపు దర్శకనిర్మాతగా రాణిస్తూనే, మరోవైపు ఇతర దర్శకులతో చిత్రాలను తెరకెక్కించారు. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో భరద్వాజ నిర్మించిన వన్ బై టూ, కృష్ణవంశీ దర్శకత్వంలో అంతఃపురం వంటి చిత్రాలను నిర్మించి జనాన్ని ఆకట్టుకున్నారు. ఆయన దర్శకత్వం వహించి, నిర్మించిన ప్రతిఘటన తరువాత మళ్ళీ మెగాఫోన్ పట్టలేదు. దాదాపు ఏడేళ్ళయింది ఆయన సినిమాను రూపొందించి. అయితే సోషల్ మీడియాలో ఆ మధ్య యాక్టివ్ గానూ అలరించారు. ఏది ఏమైనా తెలుగు సినిమా రంగంలో భరద్వాజ అనగానే అందరివాడు అనే పేరు సంపాదించారు.