ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆగస్టు 15 ముందు వరకు ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నది. ఆగస్టు 19 వ తేదీ ఆఫ్ఘన్‌కు స్వాతంత్య్రం వచ్చిన రోజు. ఆ రోజుకు ముందే తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నారు. ఆగస్టు 31 లోగా అమెరికా బలగాలు ఉపసంహరించుకోవాలని ఇప్పటికే తాలిబన్లు హుకుం జారీ చేశారు. ఇదే సమయంలో ఐసిస్ ఉగ్రవాదులు కాబూల్‌లోని ఎయిర్‌పోర్ట్‌పై దాడులు చేయడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆఫ్ఘన్‌ను తాలిబన్లకు అప్పగిస్తే అక్కడ తిరిగి స్థానిక ఉగ్రవాదులు రెచ్చిపోవడం ఖాయమని ప్రపంచదేశాలు ఆందోళన చేస్తున్నాయి. ఇప్పటికే మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నది. రాబోయే రోజుల్లో ఈ ఉల్లంఘన మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అంతేకాదు, 2001 నుంచి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్ సైనిక అవసరాల కోసం కోట్ల రూపాయలను వెచ్చించి ఆయుధాలను అందించింది అమెరికా. అధునాతన రైఫిల్స్, ట్యాంకర్లు, యుద్ధవిమానాలు, హెలికాఫ్టర్లు… ఇలా ఎన్నింటినో అందించింది. అవన్నీ ఇప్పుడు తాలిబన్ల వశం అయ్యాయి. అంతేకాదు, తాలిబన్లు ఆధునాతన రక్షణ వ్యవస్థకోసం బద్రి 313 వ్యవస్థను ఏర్పాటు చేసింది. 1400 ఏళ్ల క్రితం బ్యాటిల్ ఆఫ్ బదర్ పేరుతో ఎలాంటి సైనిక వ్యవస్థ ఉండేదో, అలాంటి సైనిక వ్యవస్థను ఇప్పుడు తాలిబన్లు ఏర్పాటు చేశారు. వీరికి సైనిక యూనిఫాం తో పాటుగా, అధునాతన ఆయుధాలును కూడా అందించారు. అమెరికా వదిలేసి వెళ్లిన ఆయుధాలను ప్రస్తుతం వీరు వినియోగిస్తున్నారు. హెలికాఫ్టర్లు, యుద్ధవిమానాల వినియోగం, విడిభాగాలు, ఇంజినీరింగ్ వ్వవస్థను సమకూర్చుకుంటే తాలిబన్ల వలన ఎప్పటికేనా మిగతా దేశాలకు ప్రమాదమనే చెప్పాలి.