(ఆగస్టు 11తో సునీల్ శెట్టికి 60 ఏళ్ళు పూర్తి)
విలక్షణ నటుడు సునీల్ శెట్టి కన్నడ నాట పుట్టినా, బాలీవుడ్ లో తనదైన బాణీ పలికించారు. హిందీ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లోనూ నటించి మెప్పించారు. అప్పట్లో కండలవీరునిగా రాణించిన సునీల్ శెట్టి ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గా అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆగస్టు 11తో సునీల్ శెట్టి షష్టి పూర్తి జరుపుకుంటున్నారు. ఒకప్పుడయితే షష్టి పూర్తికి ఎంతో ప్రాముఖ్యం ఉండేది. ఇప్పుడున్న ఎంతోమంది హీరోలు అరవైదాటినా నేటికీ యంగ్ హీరోల్లా ఆకట్టుకుంటూనే ఉన్నారు. అందువల్ల సునీల్ శెట్టి సైతం 60 అన్నది ఓ సంఖ్య మాత్రమేనని, తనలో ఇప్పటికీ 1992 నాటి సత్తా ఉందని చెబుతున్నారు. ఆ మధ్య విష్ణుతో కలసి ‘మోసగాళ్ళు’ చిత్రంలో నటించారు సునీల్ శెట్టి.
సునీల్ శెట్టి 1961 ఆగస్టు 11న మైసూర్ లోని ముల్కీ ప్రాంతంలో జన్మించారు. చదువుకొనే రోజుల్లో బాడీ బిల్డింగ్ పై ఆసక్తితో కండలు పెంచారు సునీల్. ఆయనను చూసిన మిత్రులు సినిమా హీరోలా ఉన్నావని అనేవారు. అదే ఆయనలో సినిమా రంగంవైపు అడుగులు వేసేలా చేసింది. దక్షిణాదిలో హీరోలుగా రాణించడం కష్టం అని భావించిన సునీల్ బాలీవుడ్ వైపు పరుగు తీశారు. ఆరంభంలో పలు పాట్లు పడ్డారు. 1992లో దీపక్ ఆనంద్ రూపొందించిన ‘బల్వాన్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఇందులో దివ్యభారతి నాయిక. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత అక్షయ్ కుమార్ తో కలసి ‘వక్త్ హమారా హై’లో నటించారు సునీల్. తరువాత అక్షయ్ తో సునీల్ కలసి నటించిన ‘మోహ్రా’, ‘దఢ్కన్’ వంటి చిత్రాలు సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. కేవలం హీరో వేషాలే వేస్తానని కూర్చోక తన దరికి చేరిన ప్రతీ చిత్రంలో నటించి మెప్పించారు సునీల్. ఆ నాటి బాలీవుడ్ స్టార్స్ లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా స్టార్ గా రాణిస్తున్న రోజుల్లోనే సునీల్ ముంబయ్ లో H2O అనే బార్ అండ్ క్లబ్ ను నెలకొల్పారు. తరువాత ‘ఆర్ హౌస్’ అనే లగ్జరీ ఫర్నీచర్ షాప్ కూడా ఏర్పాటు చేశారు. బిజినెస్ మేన్ గానూ తనదైన బాణీ పలికిస్తూ సాగిపోతున్నారు.
కిక్ బాక్సింగ్ లో బ్లాక్ బెల్ట్ సాధించిన సునీల్ శెట్టి, మనా శెట్టిని పెళ్ళాడారు. వారికి ఇద్దరు పిల్లలు – అమ్మాయి అతియా శెట్టి, అబ్బాయి అహాన్. 2015లో తెరకెక్కిన ‘హీరో’ చిత్రం ద్వారా అతియా శెట్టి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నటనను స్వీకరించింది. ఇక అహాన్ ‘తడప్’ అనే చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తెలుగులో విజయం సాధించిన ‘ఆర్ ఎక్స్ 100’ ఆధారంగా ఈ ‘తడప్’ తెరకెక్కుతోంది. ఈ సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఓ వైపు కూతురు, మరోవైపు తనయుడు ఇద్దరూ తనలాగే నటనను వారసత్వంగా తీసుకున్నందుకు సునీల్ శెట్టిలోని తండ్రి హృదయం పొంగిపోతోంది. సునీల్ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.