ఐదు దశాబ్దాలుగా నలుగుతోన్న బ్యారేజ్ అంశంపై ఎట్టకేలకు ట్రైబ్యునల్ నుంచి సానుకూల తీర్పు వచ్చింది. ఆ తీర్పుతో ఖుషీ అయ్యారు అధికార పార్టీ నాయకులు. ఆ విజయం తమదే అని ప్రచారం చేసుకున్నారు కూడా. త్వరలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తామని ప్రకటనలు గుప్పించారు. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించి ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్. ఇంతకీ నేతలకు మింగుడు పడని అంశాలేంటి? దశాబ్దాల కల.. కలేనా?
1961లోనే నేరడి బ్యారేజీ కోసం శంకుస్థాపన
నేరడి బ్యారేజ్. వంశధార వరద నీటిని మళ్లించే ఈ ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లా వాసుల ఐదు దశాబ్దాల కల. 1961లోనే నాటి సీఎం దామోదరం సంజీవయ్య శంకుస్థాపన చేశారు. 8 కోట్లతో అంచనాలు వేశారు. నేరడి బ్యారేజీ కడితే తమకు తీరని నష్టం జరుగుతుందని ఒడిశా ప్రభుత్వం అడ్డుపడటంతో బ్రేక్ పడింది. ఈ సమస్యపై రాజకీయ క్రీడా మొదలైంది. అప్పటి నుంచీ నేతలకు రాజకీయ వస్తువైంది కానీ.. కొలిక్కి రాలేదు. ఇటీవల కొంత కదలిక వచ్చినా.. క్షేత్రస్థాయిలోని పరిస్థితులు భిన్నంగా ఉండటంతో దూకుడుగా వెళ్లినవారు తుపాకీ దెబ్బకు కనిపించకుండా పోయారు.
2005లో హిర మండలంలో నాటి సీఎం వైఎస్‌ఆర్ శంకుస్థాపన
బ్యారేజీ నిర్మాణానికి అనుకూలంగా వంశధార ట్రైబ్యునల్ తీర్పు
ఒడిశాతో సంబంధం లేకుండా భామిని మండలం కాట్రగడ్డ నుంచి నీటి మళ్లించేలా డిజైన్ మార్చి.. 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హిర మండలంలో పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులపైనా ఒడిశా అభ్యంతరాలు తెలియజేసింది. తమ రాష్ట్రంలో తాగునీటి సమస్య వస్తుందని ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వివాదం పరిష్కారానికి వంశధార ట్రైబ్యునల్ ఏర్పాటైంది. వరద నీటిని పక్క కాల్వల ద్వారా మళ్లించుకోవచ్చని 2013లో తొలి తీర్పు వచ్చింది. 2018లో బ్యారేజీ నిర్మాణానికి ట్రైబ్యునల్ ఓకే చెప్పింది. ట్రైబ్యునల్ తీర్పుపై ఒడిశా మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
త్వరలో సీఎంతో శంకుస్థాపన చేయిస్తామన్న మంత్రి అప్పలరాజు
సముద్రంలో కలిసే వంశధార జలాలను ఎవరి వాటాగా వారు వినియోగించుకోవాలని ఏపీ, ఒడిశాలకు స్పష్టం చేస్తూ ఒక కమిటీని వేసింది అత్యున్నత న్యాయస్థానం. ఒడిశాలో మునిగే 106 ఎకరాల సేకరణకు నష్టపరిహారం ఏపీనే భరించాలన్నది నాటి తీర్పు సారాంశం. దీంతో ఇన్నాళ్టికి సమస్య కొలిక్కి వచ్చిందని.. ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని జిల్లాలోని వైసీపీ నేతలు భావించారు. త్వరలో సీఎంతో శంకుస్థాపన చేయిస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రకటించారు కూడా. ఇంతలో సీన్ మళ్లీ రివర్స్ అయింది.
read also : ఇల్లెందు టీఆర్ఎస్‌లో సింగరేణి సెగ !
క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉండటంతో నేతలు గప్‌చుప్!
నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన క్షేత్రస్థాయిలోని పరిస్థితులు మరోలా ఉండటంతో జిల్లాలోని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు నోరెత్తడం లేదు. సుప్రీంకోర్టులో ఒడిశా వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉండటం.. ట్రైబ్యునల్ తీర్పును కేంద్రం గెజిట్ చేయకపోవడం.. 106 ఎకరాలకు బదులు ఐదొందలకుపైగా ఎకరాలకు ఏపీ పరిహారం చెల్లించాల్సి వస్తుందని తెలిసి ఎవరికి వారు సైలెంట్ అయ్యారట.
విషయం తెలుసుకున్న అధికార, విపక్షాలు సైలెంట్
ఈ బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా సహకరిస్తుందన్న ఆశలు లేవట. ట్రైబ్యునల్‌లో ఊరట దక్కినా.. పరిస్థితులు అనుకూలంగా లేవని గ్రహించి నేరడి ఊసే ఎత్తడం లేదు అధికార పార్టీ నేతలు. అవకాశం చిక్కితే వైసీపీని ఇరుకున పెట్టే టీడీపీ నాయకులు కూడా పరిస్థితులు గమనించి కిమ్మనడం లేదు. దీంతో ఐదు దశాబ్దాల సిక్కోలు జిల్లా వాసుల కల కలగానే మిగిలిపోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విషయాలు తెలుసుకోకుండా బీరాలు పలికినవారి మాటలు గుర్తు చేస్తూ జోకులు పేలుతున్నాయి.