తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ప్రతిపక్ష పాత్రకే పరిమితం. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా లాభం లేదట. ఇదే సమయం అనుకున్నారో ఏమో అక్కడ షాడోల పెత్తనం పెరిగిపోయిందట. అసలు కంటే కొసరకే ఎక్కువ డిమాండ్ ఉందట. ఎవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
పనికావాలంటే బాబు లేదా శ్రీను దగ్గరకు వెళ్లాల్సిందేనా?
శ్రీకాకుళం జిల్లా రాజాం. ఇక్కడి ఎమ్మెల్యే కంబాల జోగులు. 2014లో జిల్లాలో టీడీపీ గాలి వీస్తే రాజాంలో జోగులు వైసీపీ నుంచి గెలిచారు. 2019లో వైసీపీ గాలిలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటంతో తన చేతుల్లో ఏం లేదని తన దగ్గరకు వచ్చే వారికి చెప్పి పంపించేసేవారు. మనకంటూ ఒక టైమ్ రావాలని సర్ది చెప్పేవారు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చినా.. కేడర్‌లో జోష్ లేదట. తనను కలిసేందుకు ఎవరు వచ్చినా.. పని కావాలంటే ఐతే బాబు.. లేకపోతే శ్రీను దగ్గరకు వెళ్లాలని సలహా ఇస్తున్నారట జోగులు. ఉద్యోగుల బదిలీలు.. పోస్టింగ్‌లు.. సిఫారసులు ఏది కావాలన్నా పెద్దాయనకు చెప్పండి.. ఆయన ఓకే అంటేనే పని అవుతుందని పాలవలస రాజశేఖరం పేరు చెబుతున్నారట. ఆ విధంగా ఎమ్మెల్యే జోగులుకు రాజశేఖరం కుమారుడు పాలవలస విక్రాంత్ షాడోగా పెత్తనం చేశారన్నది ఇక్కడి ఓపెన్ టాక్.
శ్రీను ఏది చెబితే దానికి ఎమ్మెల్యే ఓకే?
ఇప్పుడు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ వియ్యంకుడైన పాలవలస శ్రీను పేరు జపిస్తున్నారట ఎమ్మెల్యే జోగులు. నియోజకవర్గంలో ఎవరైనా మాకిది చేసిపెట్టండని అడగగానే ఠక్కున ఎమ్మెల్యే నోటి వెంట శ్రీను పేరు వస్తోందట. శ్రీనుకు చెబుతాను.. ఆయన చూసుకుంటారులే అనే మాట వచ్చేస్తుందట. దీంతో రాజాంకు ఎమ్మెల్యే ఎవరు అని చెవులు కొరుక్కుంటున్నారట జనాలు.. పార్టీ శ్రేణులు.
ఎమ్మెల్యే జోగులు నీడను కూడా శ్రీను వదలడం లేదా?
రాజాంపై పాలవలస రాజశేఖరం కుటుంబం మొదటి నుంచి పట్టు కొనసాగిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఎంపీగారి వియ్యంకుడు పావులు కదపడం చర్చగా మారింది. శ్రీను ఎప్పుడూ ఎమ్మెల్యే జోగులు వెంటే ఉంటున్నారట. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు ఏవైనా నీడగా కదులుతారని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం రాజాం మున్సిపాల్టీ అయింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మున్సిపల్ ఛైర్మన్ కుర్చీ తనకే దక్కాలనే ఆలోచనతో శ్రీను పావులు కదుపుతున్నారట.
ఇటు రాజశేఖరం.. అటు ఎంపీ వియ్యంకుడు!
ఒకవైపు పెద్దాయన కుటుంబం మరోవైపు ఎంపీగారి వియ్యంకుడు కావడంతో ఎమ్మెల్యే జోగులు సైతం ఈ రెండు పవర్ స్టేషన్ల మధ్యే ఊగిసలాడుతున్నారట. విక్రాంత్ బాబు మాటెలా ఉన్నా .. శ్రీను లేకపోతే మాత్రం ఎమ్మెల్యే అడుగు బయట పెట్టడం లేదట. ఇప్పుడు ఈ విషయంపైనే రాజాం నియోజకవర్గంతో పాటు వైసీపీ క్యాడర్‌లోనూ జోరుగా చర్చ నడుస్తోంది. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేని కాబట్టి ఏం చేయలేనంటూ అందరి దగ్గరా సానుభూతిని సంపాదించిన జోగులు.. ఇప్పుడు షాడోలకు ప్రాధాన్యం ఇవ్వడంతో మళ్లీ చర్చగా మారారు. దీంతో రాజకీయాల్లో రాణించాలంటే పదవి ఉంటే సరిపోదని.. దానిని అనుభవించే యోగం కావాలని చెవులు కొరుక్కుంటున్నారు కేడర్.