ఆమె ఏ పనిచేసినా ఓ లెక్క ఉంటుందా? ప్రచారంపై ప్రేమ కూడా అంతేనా? కంటెంట్ కంటే కటౌట్‌ను నమ్ముకుంటారా? ఇప్పుడు సీఎం దృష్టిలో పడితే జాతకం మారిపోతుందనే ఆశల్లో ఉన్నారా? అందుకే వచ్చిన ఏ అవకాశాన్నీ వదలుకోవడం లేదా? తాజాగా ముఖ్యమంత్రి పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆమె చేసిన ఫీట్లు.. పాట్లు.. పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరిచాయట. అవేంటో.. ఎందుకో ఈ స్టోరీలో చూద్దాం.
సీఎం పాల్గొన్న కార్యక్రమంలో రజనీ హడావిడి!
విడదల రజని. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీ మెట్లెక్కారు. సీఎమ్ రేంజ్‌లో మేడమ్ స్టైల్ ఉంటుందని లోకల్ టాక్. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌పై రజనీ ప్రచారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె గురించి అందరికీ తెలిసిన బ్యాక్ డ్రాపే ఇది. పార్టీలో లేదా.. నియోజకవర్గంలో ఏ పని చేసినా.. ప్రచారం కల్పించుకోవడంలో రజనీకి తెలిసినంత టెక్నిక్‌లు మిగతా వైసీపీ ఎమ్మెల్యేలకు తెలియదంటారు. తాజాగా సీఎం జగన్ పాల్గొన్న కార్యక్రమానికి మేడమ్ వచ్చారు. మంత్రులు.. ఎంపీలు… ఇతర ఎమ్మెల్యేలకంటే రజనీ చేసిన హడావిడికి అధికాపార్టీ నేతలు షాక్ అయ్యారట.
పూల బోకే నుంచి సెండాఫ్ వరకు ప్రతి ఫ్రేమ్‌లో రజనీ మేడమ్!
సీఎమ్ ప్రోగ్రామ్‌లో ప్రొటోకాల్స్ ఉంటాయి. సంబంధిత శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇస్తారు. కార్యక్రమం నిర్వహణలో కీలక పాత్ర వారిదే. ఆ తర్వాతే జిల్లాలోని శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులకు చోటు కల్పిస్తారు. ఆ మాత్రం ఛాన్స్ ఇస్తే చాలు అల్లుకుపోతాను అన్నట్టుగా మేడమ్‌గారు చెలరేగిపోయారని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ వర్గాలు. గుంటూరు ఎయిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం జగన్ హాజరైనప్పుడు.. ఆయనకు పూల బొకే ఇచ్చిన దగ్గర నుంచి తిరిగి కారెక్కి వెళ్లిపోయే వరకు ప్రతి ఫ్రేమ్‌లో కనిపించేందుకు ఆమె పడరాని పాట్లు పడ్డారని రజనీని చూసిన వారు చెప్పుకొంటున్నారు.
రజనీ పాట్లు చూసి పార్టీ వర్గాలు జోకులు!
సీఎం జగన్‌కు దగ్గరగా ఏ ప్లేస్‌లో ఉంటే ఫొటోలు.. వీడియోలలో కవర్ అవుతారో రజనీ మేడమ్‌కు బాగా తెలుసు. ముఖ్యమంత్రి మొక్క నాటే కార్యక్రమంలో ఈ చిలకలూరిపేట ఎమ్మెల్యే చేసిన ఫీట్లు.. చూసి తెగ జోకులు వేస్తున్నాయి పార్టీ శ్రేణులు. సీఎం జగన్ వేదిక ఎక్కే సమయం కంటే ముందుగానే స్టేజ్ పైకి చేరుకుని.. ఆయనకు అభివాదం చేయడానికి మొదటి వరసలో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు ఈ ఎమ్మెల్యేగారు. అభివాదం చేస్తూనే సీఎంతో మాటలు కలిపేశారు.
సీఎం కారు కదిలేంత వరకు ఒకటికి పదిసార్లు దండాలు!
కార్యక్రమం పూర్తయ్యాక కారెక్కి వెళ్లే సీఎం జగన్ దృష్టిలో పడేందుకు రజనీ మేడమ్ పోటీ పడ్డారు. వేదికపై ఉన్న మంత్రులు.. ఇతర సీనియర్ నేతల కంటే ముందుగానే వడివడిగా అడుగులు వేసుకుంటూ కారు దగ్గరకు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కారు కదిలేంత వరకు డోర్ దగ్గర నిలబడి ఒకటికి పదిసార్లు దండాలు పెట్టి హమ్మయ్య బాగానే గిట్టుబాటైందన ఫీలింగ్ ఎమ్మెల్యేలో కనిపించిందట.. అక్కడున్న వైసీపీ నేతలకు.
కేబినెట్‌లో బెర్త్ కోసమే విడదల రజనీ పాట్లు?
ఆ మధ్య సీఎం క్యాంప్ ఆఫీస్‌కు ఇతర మహిళా ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసి స్వామిభక్తి చాటుకున్నారు రజనీ. ఇప్పుడేమో సీఎంతోపాటు ప్రతిఫ్రేమ్‌లో కనిపించేందుకు అనేక ఫీట్లు చేశారు. ఇవన్నీ చూసిన పార్టీ వర్గాలు మేడమ్ లెక్క వేరే ఉందని కామెంట్స్ చేస్తున్నాయి. మరో ఐదారు నెలల్లో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని… అందుకే ఇప్పటి నుంచే బీసీతోపాటు మహిళా కోటాలో బెర్తు కోసమో ఈ పాట్లు అని గుసగుసలాడుకుంటున్నారు. అదండీ అసలు సంగతి..! మేడమ్ ఏ పని చేసినా వెనక బలమైన కారణం ఉంటుందన్నమాట. మరి.. ఈ ఫీట్లు.. పాట్లు.. విజువల్ రజనీకి వర్కవుట్ అవుతాయో లేదో చూడాలి.