ఆ ఎమ్మెల్యే పక్కచూపులు చూస్తున్నారా? ముందే కర్చీఫ్ వేస్తున్నారా? భవిష్యత్ రాజకీయాలకు చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టారా? తాజా ఎపిసోడ్‌లో ఆ విధంగా చర్చల్లోకి వచ్చిన ఆయన ఎవరు? కలకలం రేపుతోన్న భేటీ ఏంటి? ఎమ్మెల్యే వివరణ ఇచ్చినా చర్చ ఎందుకు ఆగడం లేదు? ఈ స్టోరీలో చూద్దాం.
బ్రదర్ అనిల్‌ను ఎందుకు కలిశారు?
టీఆర్‌ఎస్ వర్గాలతోపాటు.. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సడెన్‌గా చర్చల్లోకి వచ్చారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల భర్త.. బ్రదర్స్ అనిల్‌కుమార్‌ను రాజయ్య కలవడమే ఆ చర్చకు కారణం. ఆయన సడెన్‌గా బ్రదర్ అనిల్‌కుమార్‌ను ఎందుకు కలిశారు? బలమైన రాజకీయ కారణం ఏదైనా ఉందా.. అని వారి భేటీకి సంబంధించిన ఫొటోలు చూసినవాళ్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.
బ్రదర్ అనిల్‌తో ఉన్న ఫొటోలపై రకరకాల విశ్లేషణలు
ఇతర పార్టీల నుంచి ముఖ్యనేతలను చేర్చుకునే పనిలో YSR TP ఉంది. సరిగ్గా ఇదే సమయంలో బ్రదర్ అనిల్‌తో రాజయ్య ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. టీఆర్‌ఎస్‌లో రాజయ్యకు అన్యాయం జరిగిందని గతంలో షర్మిల చేసిన కామెంట్స్‌ను జోడిస్తూ తాజా ఫొటోలకు రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. పైగా ఇటీవల కాలంలో రాజయ్య చేస్తున్న పనులు వివాదాస్పదంగా ఉంటున్నాయని గులాబీ శిబిరంలోనే చర్చ జరుగుతోందట.
స్టేషన్ ఘనపూర్‌లో శ్రీహరితో నిత్యం రగడ!
టీఆర్‌ఎస్ తొలిసారిగా ప్రభుత్వం చేపట్టినప్పుడు రాజయ్య డిప్యూటీ సీఎం. కొద్దికాలానికే అనూహ్యంగా ఆ పదవి నుంచి బర్తరఫ్ అయ్యారు. సీఎంను కలిసి క్షమాపణలు చెప్పడం వల్లే 2018లో ఆయనకు మళ్లీ టికెట్ ఇచ్చారని చర్చ జరిగింది. అంతేకాదు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేషన్‌ఘనపూర్‌లో కూడా పర్యటించారు గులాబీ బాస్. ఇదంతా ఒక ఎత్తు అయితే నియోజకవర్గంలో కడియం శ్రీహరికి.. రాజయ్యకు మధ్య ఉప్పు నిప్పులా ఉంటోంది రాజకీయం. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. స్వపక్షంలో విపక్షంగా మారి విమర్శలు చేసుకుంటున్నారు.
శ్రీహరికి ప్రాధాన్యం ఇస్తే రాజయ్యకు కష్టమేనా?
ఇటీవల వరంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. గతానికి భిన్నంగా కడియం శ్రీహరి ఇంటికి విందుకు వెళ్లారు. అప్పటికే శ్రీహరి ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో.. ఆయనకు మరోసారి పదవీ యోగం ఉంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో శ్రీహరి ఇంటికి సీఎం వెళ్లడంతో ఎమ్మెల్యే రాజయ్య అండ్ కో శిబిరంలో కలవరం మొదలైందట. ఒకవేళ కడియం శ్రీహరికి మళ్లీ ఎమ్మెల్సీ ఇచ్చి.. పార్టీలో ప్రాధాన్యం ఇస్తే.. తన పరిస్థితి ఏంటి? నిత్యం ఆయతో గొడవ పడుతూనే ఉండాలా? టీఆర్‌ఎస్‌లో మళ్లీ మునుపటి గుర్తింపు వస్తుందా లేదా అన్న ఆలోచనలో ఉందట రాజయ్య శిబిరం.
బ్రదర్ అనిల్‌తో ఉన్నవి పాత ఫొటోలట!
నిప్పు లేకుండా పొగ రాదు కదా అని చర్చ
బ్రదర్ అనిల్‌తో ఉన్న ఫొటోలు రాజకీయ దుమారం రేపడంతో మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు రాజయ్య. బ్రదర్ అనిల్‌తో ఉన్న ఫొటోలు పాతవిగా చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌లో తాను సంతృప్తిగా ఉన్నానని.. స్వామి భక్తిని చాటుకున్నారు కూడా. టీఆర్ఎస్ నుంచి ఒత్తిడి వచ్చిందో ఏమో.. ఆగమేఘాలపై మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు రాజయ్య. అయితే గులాబీ శిబిరంలో ఈ మాజీ డిప్యూటీ సీఎంకు ఎదురైన అనుభవాలు.. ప్రస్తుత పరిణామాలు చూసిన వాళ్లు మాత్రం.. నిప్పులేకుండా పొగరాదు కదా అని ముక్తాయిస్తున్నారు. రాజయ్య వివరణ ఇచ్చినా చర్చ ఆగకపోవచ్చని అనుకుంటున్నారట.