కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆ మాజీ ఎమ్మెల్యే మనసు మార్పు కోరుకుంటుందా? బ్యాక్ టు పెవీలియన్ అని వచ్చేస్తారా? అనుచరుల మాటేంటి? మాజీ ఎమ్మెల్యే మాట వింటారా? రాం రాం చెబుతారా? ఇదే ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో ఆసక్తిగా మారింది.
కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌వైపు చూస్తున్నారా?
బీజేపీలో రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటూ వెళ్లిన చాలా మంది కాంగ్రెస్ నాయకులు తిరిగి వెనక్కి వచ్చేయడానికి చూస్తున్నరనే చర్చ తెలంగాణలో జోరందుకుంది. ఇప్పటికే కొందరు బీజేపీకి గుడ్‌బై చెప్పి కొత్త పీసీసీ చీఫ్‌తో టచ్‌లోకి వెళ్లారు. మరికొందరు కూడా ఆ దారిలో వెళ్తున్నట్టు చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రచారంలోకి వస్తున్న పేర్లు గులాబీ శిబిరాన్ని కలవరపెడుతున్నాయి. ఆ జాబితాలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పేరు కూడా వినిపిస్తోంది.
కమలం శిబిరంలో ఇమడ లేకపోతున్నారా?
గతంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కూన శ్రీశైలం గౌడ్ చాలా కాలంపాటు హస్తంపార్టీ నీడలో ఉన్నారు. అయితే కాలం కలిసి రావడం లేదని అనుకున్నారో ఎమో.. బీజేపీలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నికలో ఒక మండలానికి బీజేపీ ఇంచార్జ్‌గా కూడా ఉన్నారు. మెడలో కాషాయ కండువా ఉన్నా.. మనసులో మాత్రం ఏదో వెలితి ఉండిపోయిందట. కమలం శిబిరంలో ఆయన ఇమడ లేకపోతున్నట్టు సమాచారం. అసంతృప్తితో ఉన్నారట. ఈలోగా తెలంగాణలో పీసీసీ పగ్గాలు మారడంతో కాంగ్రెస్‌లోకి వెనక్కి వెళ్లితే ఎలా ఉంటుందో అని ఆలోచన చేస్తున్నారట.
కూన అనుచరులు ఆయన మాట వినడం లేదా?
అనుచరుల తీరుపై కూన శిబిరంలో ఆందోళన
తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లితే ఒక్కడిగా కాకుండా.. అనుచరులను తీసుకుని వెళ్లి చేరాలని కూన అనుకుంటున్నట్టు ఆయన వర్గం చెబుతోంది. అయితే కూన అనుచరులుగా ముద్ర పడ్డ కొందరు నాయకులు… స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆయన మాట వినడం లేదని సమాచారం. ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్న అనుచరులు కొందరు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్తామని చెబుతున్నారట. దీంతో కూనకు మింగుడుపడటం లేదని తెలుస్తోంది. ఈ విధంగా టచ్‌మీ నాట్ అన్నట్టుగా కూనతో ఉంటున్న వారిలో ప్రధాన అనుచరుల పేర్లు వినిపిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే శిబిరం ఆందోళనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ పరిణామాల తర్వాత బీజేపీని వీడి కాంగ్రెస్‌లోకి ఒంటరిగా వెళ్లడమా లేదా అని మథన పడుతున్నారట శ్రీశైలం గౌడ్. కేడర్ వెంట రాకపోతే క్షేత్రస్థాయిలో బలం ఉండదు. వెళ్లే పార్టీలోనూ తగిన గుర్తింపు ఇస్తారో లేదో అనుమానాలు ఉంటాయి. మరి.. బ్యాక్ టు పెవీలియన్ విషయంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఎలాంటి ఎత్తుగడ వేస్తారో చూడాలి.