అక్కడ పోస్టింగ్ కోసం బాగా సమర్పించుకుంటారు. పోస్టింగ్ వచ్చాక తమకు సమర్పించుకునే వాళ్లకోసం వెతుకుతారు. తప్పో ఒప్పో అక్కడికి వెళ్లారా సీన్ సితారే. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
ఏసీబీ దాడులు చేస్తున్నా సిబ్బందిలో మార్పు లేదు!
ఏసీబీకి దొరికినా.. ఎవరు ఆరోపణలు చేసినా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ స్టాఫ్ తీరు అస్సలు మారడం లేదు. అదే స్టేషన్లో పదే పదే సిబ్బంది ఏసీబీ వలకు చిక్కుతున్నా తర్వాత వచ్చేవారిలోనూ మార్పు రావట్లేదు. ఏజెన్సీ ముఖద్వారంలో ఉన్న జంగారెడ్డిగూడెం పీఎస్ అక్రమాలకు నిలయంగా మారింది. మొన్నా మధ్య ఓ సీఐ ఏసీబీకి అడ్డంగా దొరికిపోతే.. తాజాగా ఓ ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుళ్లు బుక్కయ్యారు.
మాకేంటి అన్నదే స్టాఫ్‌కు ముఖ్యమా?
కలెక్షన్‌లో టాప్ రేంజ్‌లో ఉంటోంది ఈ స్టేషన్. ఇక్కడ పోస్టింగ్‌కు కూడా అదే రేంజ్ డిమాండ్ ఉందట. అడిగినంత కొట్టడం.. పోస్టింగ్ పట్టడం.. అందినంత నొక్కడం ఇదే ఇక్కడి కాన్సెప్ట్. తప్పా ఒప్పా అన్నది ఇక్కడ స్టాఫ్‌కి అవసరం ఉండదు. మాకేంటి అన్నదే వాళ్లకు ముఖ్యం.
కేసు లేకుండా రాజీ.. ఆపై లంచాలకు డిమాండ్!
ఈ స్టేషన్ పరిధిలో ఆ మధ్య రెండు కార్లు యాక్సిడెంట్ అయ్యాయి. ప్రమాదానికి కారణమైన వ్యక్తి నుంచి ఎదుటి కారు ఓనర్‌కి కొంత మొత్తం ఇప్పించి సెటిల్‌మెంట్ చేశారు. హమ్మయ్య..! కేసులు, కోర్టులు లేకుండా బయటపడ్డా.. అని బాధితుడు అనుకునేలోపు అసలు కథ మొదలైంది. మా సంగతేంటి అని బల్లకింద చేతులు పెట్టారట అక్కడి ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్. అసలే ఇబ్బంది సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు.
ఏ ప్రభుత్వంలోనైనా ఈ స్టేషన్‌లో కప్పం కామన్!
దెబ్బతిన్న కారు ఓనర్ కంటే పోలీసులే ఎక్కువ అడుగుతుండటంతో బాధితుడు బెంబేలెత్తిపోయాడు. భరించలేని ఒత్తిడిని ACBకి చెప్పి.. ఆ ముగ్గురినీ పట్టించాడు. గతంలో ఓ సీఐ కూడా ఇలాగే బుక్ అయ్యాడు. అయినా వీరిలో మార్పు రాలేదు. ఇదే కాదు.. స్టేషన్ పరిధిలో జరిగే ఇసుక అక్రమ రవాణా, గ్రావెల్ తవ్వకాల్లో సైతం స్టేషన్ ఫిక్స్ చేసిన రేట్లు కక్కాల్సిందే. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని కాకుండా ఏ ప్రభుత్వమైనా జంగారెడ్డిగూడెం స్టేషన్‌లో కప్పం కామనైంది.
జనాల్ని ఇలా పీల్చుకుతింటున్న వీరి వ్యవహారంపై .. పోస్టింగ్‌లు ఇప్పించిన పెద్దలు ఎందుకు నోరు మెదపడం లేదో అందరికీ తెలిసిందే.