సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా దూకుడును పెంచుతున్నారు. గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ జనాల్లోకి విస్తృతంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలను లెవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా జనసేన ఇటీవల కొన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మన్నలను పొందే ప్రయత్నం చేస్తోంది. జనసేన తొలి విడుతగా తీసుకున్న రోడ్ల కార్యక్రమానికి ప్రజల నుంచి ఊహించని రీతిలో స్పందన లభిస్తుంది. ఇదే సమయంలో వైసీపీ వర్సెస్ జనసేన వార్ నడుస్తోంది.
ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జగన్ సర్కారును ఎదుర్కొని నిలబడలేకపోతోంది. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేరుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా వైసీపీని ఇరుకున పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతూనే సినిమా సమస్యలపై ఇటీవల ప్రశ్నించారు. అయితే ఇదికాస్తా రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ కు తెరలేపింది. ఎవరికీవారు తగ్గకపోవడంతో పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ మారిపోయింది. ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ గురించే చర్చ నడుస్తోంది.
రోడ్ల శ్రమదానం కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ నేడు రాజమండ్రిలో పర్యటన చేపట్టారు. రోడ్లపై శ్రమదానం చేసిన అనంతరం పవన్ బహిరంగ సమావేశంలో మాట్లాడారు. వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాపుకార్డును ఆయన తెరపైకి తీసుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కుల రాజకీయాలకు దూరంగా పవన్ కల్యాణ్ కాపులంతా ఏకం కావాల్సిందని పిలుపునివ్వడం వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. కాపులు ఏపీలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యతను ఆయన గుర్తు చేశారు.
కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలు ఐక్యంగా ఉంటూ బీసీ,ఎస్సీలతో కలిసి రాజ్యాధికారం దిశగా సాగాలని పవన్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్ అందుకు తగ్గట్టుగానే కాపు కార్డును తెరపైకి తీసుకొస్తున్నారు. గత ఎన్నికల్లో కాపు ఓటర్లు వైసీపీకి మద్దతుగా నిలిచారు. దీంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందని అంతా భావిస్తున్నారు. ఈ వర్గాన్ని వైసీపీకి దూరం చేయడం ద్వారా వైసీపీ ఓట్లకు పవన్ గండికొట్టే అవకాశం కన్పిస్తోంది.
మరోవైపు గత ఎన్నికల్లో జనసేనకు ఐదు నుంచి ఆరుశాతం ఓట్లు పోలయ్యారు. వీటిలో నాలుగుశాతం ఓటర్లు కాపు వర్గానికి చెందినవారే. దీంతో ఈ వర్గాన్ని తనవైపు తిప్పుకునేలా పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నట్లు కన్పిస్తోంది. అలాగే తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వైసీపీ నేతలను పవన్ వదిలిపెట్టలేదు. ఎవరికీ ఇవ్వాల్సింది వారికి ఇచ్చేశారు. ఏదిఏమైనా పవన్ కల్యాణ్ ‘పవర్’ ఫుల్ గా వాడబోతున్న కాపు కార్డు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సిందే..!