గుట్కా నిషేధించటం మంచి విషయమే. కానీ, ఈ నిషేధం సక్రమంగా అమలు కావటం అంత తేలిక కాదు. ఇప్పుడు తెలంగాణలో ఇదే పరిస్థితి కనిపిస్తోందట సాక్షాత్తూ పోలీసులే గుట్కా నిషేధానికి తూట్లు పొడుతున్నారట. అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారట.. తయారీకి, రవాణాకు సపోర్ట్ చేస్తున్నారట కొందరు కిందిస్థాయి అధికారులు.
తెలంగాణలో గుట్కాని ప్రభుత్వం నిషేధించింది. అమ్మినా కొనుగోలు చేసిన కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తయారీదారులపై కూడా ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గుట్కా తయారు చేసి విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తోంది.అయితే ఇన్ని చేసినప్పటికీ తెలంగాణలో గుట్కా కట్టడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.గుట్కా రాష్ట్రంలోకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఫలితం మాత్రం పెద్దగా కనిపించటం లేదు.
పై స్థాయి అధికారులు గుట్కా కట్టడి కోసం తగిన వ్యూహాలు రచిస్తోంటే, కింది స్థాయిలో ఉన్న అధికారులు మాత్రం గుట్కా మాఫియాకి చేదోడు వాదోడుగా ఉంటున్నారనే టాక్ ఉంది. అంతేకాకుండా తమ ఏరియాలో గుట్కా మాఫియాకు సపోర్ట్ చేసేందుకు పెద్ద మొత్తంలో ఆమ్యామ్యాలకు పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా పాతబస్తి, దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గుట్కా విచ్చలవిడిగా దొరుకుతోంది. అంతేకాకుండా గుట్కా తయారీదారులు కూడా ఇక్కడే ఎక్కువ వరకు పట్టుబడుతున్నారు.
పాతబస్తీ కేంద్రంగా ఇప్పటివరకు ఉన్న తయారీదారులు, ఇప్పుడు నగర శివారు ప్రాంతాల్లో మకాం వేశారు. నగర శివారు ప్రాంతాలైన కాటేదాన్, మైలార్ దేవ్ పల్లి, పహాడీ షరీఫ్, ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు గుట్కా మాఫియా పాగా వేసింది ఇక్కడే గుట్కాను తయారుచేసి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారని తేలింది. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని తెలంగాణవ్యాప్తంగా కూడా దీన్ని సప్లై చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో కొందరు పోలీసు అధికారులపై వేటు వేయడంతో అసలు విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది.
ఓ ఇన్స్ పెక్టర్ తో పాటు కొంతమంది పోలీసులు గుట్కా మాఫియాకి అండదండగా ఉన్నట్లు బయటపడింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్ వెంటనే అధికారులపై వేటు వేశారు. ఎవరైనా సరే గుట్కా రవాణాకు సపోర్ట్ గా ఉంటే వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే కాటేదాన్, రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఈ గుట్కా మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోందని తెలుస్తోంది. దీనికి ఒక పోలీస్ అధికారి అండగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై రాచకొండ పోలీస్ కమిషనర్ వెంటనే విచారణ ప్రారంభించారు. రహస్యంగా చేసిన విచారణలో ఒక పోలీస్ అధికారిని గుర్తించారట
మరోపక్క ఇతర రాష్ట్రాల నుంచి కూడా గుట్కా పెద్ద ఎత్తున రాష్ట్రం లోకి వచ్చి పడుతోంది. ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల నుంచి గుట్కా ఎక్కువగా తెలంగాణ లోకి ప్రవేశిస్తోంది. దీన్ని సరిహద్దు ప్రాంతంలోనే కట్టడి చేయాలి. కానీ, అధికారుల నిఘా వైఫల్యంతో తెలంగాణలో యథేచ్ఛగా రవాణా అవుతోందనే టాక్ ఉంది.
ఇప్పటికైతే, హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ గుట్కా మాఫియా ని పూర్తిగా కట్టడి చేసేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కొంతమంది కిందిస్థాయి అధికారులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా సపోర్ట్ చేస్తున్నారటనే వాదనలు వినిపిస్తున్నాయి.