రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నవారు.. సర్వీస్‌లో చేరి పది-పదిహేనేళ్ల తర్వాత అవినీతికి అలవాటు పడటం పాత ట్రెండ్. ఉద్యోగంలో చేరిన వెంటనే బల్ల కింద చేతులు పెట్టడం కొత్త ట్రెండ్. ఏపీ సచివాలయంలో ఇలాంటి వారి సంఖ్య పెరిగిందట. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన ఒక సమస్య IASలకే షాక్ ఇచ్చిందట. దానిపైనే సెక్రటేరియట్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఉద్యోగంలో చేరిన 6 నెలల్లోనే లంచాలు!
ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరైనా కొత్తగా చేరితే ఉత్సాహంగా పనిచేస్తారు. చకచకా పనులు చేయిస్తారు. పని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు కూడా. ఏపీ సచివాలయంలో ఇటీవల ASOలుగా రిక్రూటైన కొందరు పనితీరు మాత్రం భిన్నంగా ఉందట. పని నేర్చుకోవడం సంగతి దేవుడెరుగు.. తమ పరిధిలో ఏదైనా చేయాలంటే బల్లకింద చేతులు పెట్టేస్తున్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారట. ఉద్యోగంలో చేరిన ఆరు నెలల్లోనే పక్కదారి పట్టినవారిపై చర్చ జరుగుతోంది. వారి పనితనం చూసిన సీనియర్లు నోళెళ్లబెట్టే పరిస్థితి. మనం ఉద్యోగంలో చేరినప్పుడు ఎలా ఉండేవాళ్లం.. కొత్త బ్యాచ్ ఎలా ఉందని చర్చించుకుంటున్నారు.
విధి నిర్వహణలో ఏఎస్‌వో అత్యుత్సాహం!
ఏఎస్‌వోను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఫైల్ సిద్ధం?
ఓ జూనియర్ ASO ఏకంగా ఇద్దరు సీనియర్ IASలకే షాక్ ఇచ్చాడట. కీలక శాఖలో పనిచేస్తున్న ఆ యువ ఉద్యోగి.. విధి నిర్వహణలో అత్యుత్సాహం ప్రదర్శించినట్టు సమాచారం. అతని అవినీతి ఆ శాఖ ఉన్నతాధికారైన IASకు తెలిసిందట. సమస్యను సీరియస్‌గా పరిగణించిన ఆయన ఆ ASOను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఫైల్ పంపారట. ఆ ఫైల్ వేరే సీనియర్ ఐఏఎస్‌కు చేరింది. ఆ సంగతి తెలియగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న ASO అప్రమత్తం అయ్యాడట. తనపై చర్యలు తీసుకోకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడట.
ప్రభుత్వంలో కీలక నేతను ఆశ్రయించిన ఏఎస్‌వో?
కీలక నేత నుంచి ఫోన్ రావడంతో షాకైన ఐఏఎస్!
ప్రభుత్వంలో కీలకం పాత్ర పోషిస్తోన్న ఓ పొలిటికల్ లీడర్‌ను ఆశ్రయించాడట సదరు ASO. వెంటనే ఆ నాయకుడు.. ASOపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీనియర్ IASకు సిఫారసు చేశారట. ఇలా ఒక ASO గురించి పెద్ద సిఫారసు రావడంతో షాకవడం IAS వంతైంది. ఉద్యోగంలో చేరి 6 నెలలు కూడా కాని చిన్న ఉద్యోగి ఈ విధంగా ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించడం IAS వర్గాల్లో చర్చగా మారిందట.
ఏఎస్‌వో సంగతి ఏం చేయాలో తెలియక తికమక!
తమకే దిమ్మ తిరిగేలా ASO చేసిన పనిపై సీనియర్ ఐఏఎస్ అధికారిలిద్దరూ కంగుతిన్నారట. రాజకీయ నేత సిఫారసు ఆధారంగా చర్యలు తీసుకోకపోతే.. తప్పుచేసిన మిగతావాళ్లూ అదే పనిచేస్తారని IASలలో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సమస్యను ఎలా టేకిల్ చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారట. మొత్తానికి ఉద్యోగంలో చేరిన వెంటనే ASO చేసిన పని ఏపీ సెక్రటేరియట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పువ్వు పుట్టగానే పరిమళించిందని కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట.