ఆయనో మంత్రి. జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో అరుదుగా కనిపిస్తారని టాక్. ఇతర జిల్లాల్లో నిర్వహించే ప్రోగ్రామ్స్‌లో తళుక్కుమన్నది తక్కువే. అలాంటిది ఆ కార్యక్రమంలో మాత్రం ఆసాంతం దగ్గరున్నారు. ఇదే ఇప్పుడు ఏపీ సచివాలయంలో హాట్ టాపిక్. ఇంతకీ ఏంటా ప్రోగ్రామ్? ఎవరా మంత్రి?
నిర్మలా సీతారామన్ టూర్‌పై ఏపీ ఆర్థికశాఖలో చర్చ!
ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పీకల్లోతు ఇబ్బందుల్లో ఉంది. ఎక్కడ అప్పు దొరుకుతుందా.. అని ఆర్థికశాఖ దారులు వెతుకుతున్న పరిస్థితి. కేంద్రం వీలైనంత మేర సాయం చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని వరస రిక్వెస్ట్‌లు చేస్తోంది ప్రభుత్వం. అప్పులు తెచ్చే క్రమంలో ఆర్థికశాఖ నిబంధనలను పక్కకు పెడుతోందనే విమర్శలు.. కేంద్రం కూడా ఓ కన్నేసిందన్న ప్రచారంతో ఢిల్లీ చుట్టూ స్వయంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఇదే సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పర్యటనకు వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆమె ఏం మాట్లాడతారో.. ఏం ప్రస్తావిస్తారో అన్న ఉత్కంఠ నెలకొనడంతోపాటు ఏపీ సచివాలయంలోనూ చర్చ జరిగింది. కేంద్రమంత్రి పర్యటన ముగిసేవరకు ఆసక్తిగా గమనించారట ఉద్యోగులు.
కేంద్రమంత్రి వెంటే ఉన్న బుగ్గన!
నిర్మలా సీతారామన్ పర్యటనలో ఆసాంతం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా కనిపించారు. సహజంగా కేంద్రమంత్రి వస్తే ప్రొటోకాల్ ప్రకారం పాల్గొంటారు. ఆ శాఖకు చెందిన మంత్రి రిసీవ్ చేసుకోవడం కామన్. కేంద్రమంత్రి పాల్గొనే కార్యక్రమానికి వెళ్లాలంటే వెళ్తారు లేదంటే లేదు. ఏమైనా సమావేశాలు ఏర్పాటు చేస్తే.. కచ్చితంగా ఆ శాఖకు చెందిన మంత్రి పాల్గొంటారు. నిర్మలా సీతారామన్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఈ తరహా కార్యక్రమాలేవీ లేవు. పొందూరు ఖద్దరే అజెండా. ఆర్థికరంగం పరంగా ఎలాంటి ప్రొగ్రామ్స్ షెడ్యూల్ చేయలేదు. కానీ, కేంద్రమంత్రి పాల్గొన్న కార్యక్రమాలన్నింటిలోనూ మంత్రి బుగ్గన వెన్నంటే ఉన్నారు. అదే ఇప్పుడు చర్చగా మారింది.
ఒకరోజంతా కేంద్రమంత్రి పర్యటనలో ఉండటంతో బుగ్గనపై చర్చ!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. పైగా కేంద్ర ఆర్థికమంత్రి ఏపీకి రావడంతో.. ఆ శాఖకు రాష్ట్ర మంత్రిగా ఉన్న తాను వెళ్లకుంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయని అనుకున్నారో ఏమో నిర్మలా సీతారామన్ వెళ్లేంత వరకు వెంటే ఉన్నారాయన. మామూలుగా అయితే బుగ్గన మంత్రిగా ఇతర జిల్లాల్లో జరిగే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొంది లేదు. సొంత జిల్లాలో కర్నూలులో కూడా ఆయన పాల్గొనే కార్యక్రమాలూ అంతంతే. తన డోన్ నియోజకవర్గానికే పరిమితమయ్యే బుగ్గన ఒక రోజంతా కేంద్రమంత్రి పర్యటనలో ఉండటం చర్చ జరుగుతోంది.
ఏపీ ఆర్థికంపై మాట్లాడతారని భయపడ్డారట!
బుగ్గన వెళ్లడాన్ని ప్రొటోకాల్‌లో భాగంగా చూడాలన్నది కొందరి వాదన. ఇందులో తప్పేమీ లేదని కూడా చెబుతున్నారు. అయితే గతంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్రమంత్రుల విషయంలో ఏం జరిగిందో మర్చిపోయారా అన్నది మరికొందరి ప్రశ్న. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రమంత్రి ఎక్కడా పెద్దగా ప్రస్తావించకపోవడం కూడా ఉద్యోగ వర్గాల మధ్య చర్చగా మారింది. ఆమె వస్తున్నారని తెలియగానే.. ఏవో బాంబులు పేలుస్తారని అనుమానించారట. కానీ.. నిర్మలా సీతారామన్ పర్యటనలో అలాంటి ప్రమాదం ఏదీ రాకపోవడంతో ఏపీ ఆర్థికశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారట. మొత్తానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చారు వెళ్లారు. కానీ..చర్చ మాత్రం ఆగలేదట.