ఈమధ్యకాలంలో ఇళ్ళల్లోకే కాదు మనం పార్క్ చేసిన వాహనాల్లోకి పాములు దూరుతున్నాయి. నానా ఇబ్బందులు పెడుతున్నాయి. పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన స్కూటీలో ఓ పాము దూరింది. ఆ పామును బయటకు పంపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు మెకానిక్ ని పిలుసుకొని రావాల్సిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రోజు మాదిరిగానే ఓ ఉపాధ్యాయురాలు తన స్కూటీని స్కూల్ అవరణలో పార్కింగ్ చేశారు. స్కూటీలో పాము ఎలా దూరిందో తెలియదు కాని స్కూటీలో పామును చూసిన విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పారు. వారు స్కూటీ వద్దకు వెళ్లి కర్రతో శబ్దం చేసి స్కూటీని కిందపడేశారు. అయినా, పాము బయటకురాలేదు.
ఏంచేయాలో తెలీక స్కూటర్ మెకానిక్‌ను, పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. స్కూటీలోని పార్టులను ఊడదీసి పరికరాలను ఒక్కొక్కటిగా తొలగించి ఎట్టకేలకు పామును పట్టుకున్నారు. అనంతరం పామును అడవిలో వదిలేశారు. ఈఘటనతో దాదాపు రెండు గంటల పాటు పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. పాముని పట్టేసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.