మనదేశంలో సంగీతప్రియులకు మహదానందం పంచే వాయిద్యాలు ఎన్ని ఉన్నా, వీణ, వేణువు అన్నవి మరింత ఆనందం పంచుతూ ఉంటాయి. ఆ రెండింటి సమ్మేళనంలా వాణీ జయరామ్ గానం ఉంటుందని ప్రతీతి. ఆమె గళంలో జాలువారిన అనేక గీతాలు అమృతం కురిపించాయి. ఉత్తరం, దక్షిణం అన్న తేడా లేకుండా వాణీ జయరామ్ గళం సంగీతాభిమానులను ఎంతగానో పులకింప చేసింది. తెలుగు చిత్రాలతోనే వాణీ జయరామ్ గానం ప్రత్యేకత సంతరించుకుంది. మొత్తం మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా వాణీ జయరామ్ నిలవగా, అందులో రెండు సార్లు తెలుగు చిత్రాల ద్వారానే నేషనల్ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం!
వాణీ జయరామ్ అసలు పేరు కళైవాణి. 1945 నవంబర్ 30న తమిళనాడు వెల్లూరులో వాణి జన్మించారు. సంగీతకళాకారుల కుటుంబంలో జన్మించడం వల్ల వాణికి కూడా చిన్నతనం నుంచీ సంగీతం అంటే ప్రాణం. ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే వాణీజయరామ్ ఆల్ ఇండియా రేడియోలో పాడి అలరించారు. ఆ తరువాత పలు వేదికలపై వాణీ గానం సాగింది.
చదువు పూర్తయిన తరువాత వాణీ జయరామ్ మద్రాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. 1967లో ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చారు. 1969లో జయరామ్ తో వాణి వివాహం జరిగింది. దాంతో ముంబైకి మకాం మార్చవలసి వచ్చింది. భర్త జయరామ్ వాణిలోని గానాన్ని ఎంతగానో ప్రేమించారు, ప్రోత్సహించారు. అలా పలువురు ప్రముఖ సంగీత విద్వాంసులతో కలసి వాణీ జయరామ్ పాడే అవకాశం కల్పించారు. ప్రముఖ సంగీత దర్శకులు వసంత్ దేశాయ్ తన స్వరకల్పనలో రూపొందిన ‘గుడ్డి’ సినిమాలో మూడు పాటలు పాడించారు.
ఈ మూడు పాటలు ఆ రోజుల్లో యావత్ భారతదేశాన్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిలో “బొలే రే పపిహరా…” సాంగ్ అయితే ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉంది. వాణీ జయరామ్ గానం ఉత్తరాదిన మారుమోగగానే, మన దక్షిణాది సంగీత దర్శకులు సైతం ఆమె గానాన్ని తమ బాణీల్లో బంధించాలని ఆశించారు. తెలుగులో ఎస్పీ కోదండపాణి స్వరకల్పనలో తొలిసారి ‘అభిమానవంతులు’ చిత్రంలో పాడారు వాణీ జయరామ్. అందులో ఆమె పాడిన “ఎప్పటి వలె కాదురా… నా స్వామీ…” పాట సంగీతాభిమానులను ఎంతగానో అలరించింది.
హిందీ, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో పాడుతూనే తెలుగులోనూ వాణీ జయరామ్ తనదైన గానంతో ఎంతగానో అలరించారు. ఏవీయమ్ వారి ‘పూజ’ చిత్రంలో వాణీ జయరామ్ పాడిన “ఎన్నెన్నో జన్మలబంధం…” పాట జనాన్ని భలేగా ఆకట్టుకుంది. అందులోని ఒక్క శాస్త్రీయ గీతం తప్పిస్తే అన్ని పాటలూ వాణీ జయరామ్ పాడడం విశేషం! యన్టీఆర్ ఐదు పాత్రలు పోషించి, దర్శకత్వం వహించిన ‘శ్రీమద్విరాట పర్వము’లో ఊర్వశికి పాడిన “రమ్మని పిలిచిందిరో… ఊర్వశి…” పాట ఆకట్టుకుంది.
ఈ చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు. అలాగే సుసర్ల స్వరాల్లోనే యన్టీఆర్ తెరకెక్కించిన ‘బ్రహ్మంగారి చరిత్ర’లోనూ “శృంగార రసరాజ మౌళి…” పాటను వాణితో పాడించారు. ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజా, కేవీ మహదేవన్ స్వరకల్పనలో రూపొందిన పలు చిత్రాలలో వాణీ జయరామ్ గానం మత్తు చల్లింది. కేవీ మహదేవన్ స్వరకల్పనలో రూపొందిన ‘శంకరాభరణం’లో వాణీ జయరామ్ పాడిన పాటలకు ఆమె ఉత్తమగాయనిగా నంది అవార్డును అందుకున్నారు.
వాణీ జయరామ్ తొలిసారి 1975లో కె.బాలచందర్ తెరకెక్కించిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రం ద్వారా ఉత్తమగాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఎమ్.ఎస్.విశ్వనాథన్ సంగీతం సమకూర్చిన ఆ చిత్రంలో “ఏళు స్వరంగలుక్కుల్…” పాటతో వాణీ గానానికి పట్టాభిషేకం జరిగింది. తరువాత 1980లో కె.విశ్వనాథ్ రూపొందించిన ‘శంకరాభరణం’లో “ఏ తీరుగ నను దయ చూచెదవో…”, “దొరకునా ఇటువంటి సేవా…” పాటలతోనూ ఉత్తమగాయనిగా జాతీయ అవార్డును దక్కించుకున్నారామె.
1991లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరపై నిలచిన ‘స్వాతికిరణం’లోని “ఆనతి నీయరా హరా…” పాటతో ముచ్చటగా మూడోసారి బెస్ట్ సింగర్ గా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు వాణీ జయరామ్. ఈ చిత్రానికి కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు.భావి గాయనీగాయకులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ పలు టీవీ కార్యక్రమాలలో వాణీ జయరామ్ పాలు పంచుకున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన గీతాలను ఆలపించడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. 76 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ గానకోకిల మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.