దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు క్రెడిట్ కార్డు ఈఎంఐలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.99 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని మర్చంట్ అవుట్‌లెట్లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, యాప్‌లలో జరిపే ఈఎంఐ లవాదేవీలకు ఈ ఫీజు వర్తిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొని ఈఎంఐగా మార్చుకుంటే ఈ ఫీజు వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో ఈఎంఐ ఆప్షన్ వినియోగించుకోవాలనుకునే కస్టమర్లకు మరింత భారం పడనుంది.
Read Also: ఆర్బీఐ కొత్త స్కీమ్‌ల ప్రారంభం.. పెట్టుబడి పరిధి విస్తరిస్తుంది..
అయితే ఈ ప్రాసెసింగ్ ఫీజుకు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఇంట్రెస్ట్ ఛార్జీలకు ఎలాంటి సంబంధం లేదు. కొన్నిసార్లు చెల్లింపులను ఈఎంఐలుగా మార్చుకున్నప్పుడు విక్రయదారులు వడ్డీలపై డిస్కౌంట్లు కల్పిస్తారు. జీరో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంటుంది. అలాంటి చెల్లింపులకు కూడా ఈ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుందని ఎస్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను క్రెడిట్ కార్డు కస్టమర్లందరికీ ఈమెయిల్ ద్వారా సందేశాలను పంపింది.