భారత రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో పరిపాలన సాగిస్తున్న కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్‌లో కూడా ఉన్న విషయం మనకు తెలిసింది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజలను పలకరిస్తే కంటోన్మెంట్ ప్రాంతం కాశ్మీర్‌లా మారిందంటూ పలువురు సమాధానం చెప్పడం గమనార్హం. వారి మాటలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో తిరుమలగిరి, మారేడ్‌పల్లి, అమ్ముగూడ, హకీంపేట, జవహర్ నగర్, కార్ఖాన, బోయిన్‌పల్లి, కౌకూర్, బొల్లారం ప్రాంతాలు ఉన్నాయి.
అయితే ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఆర్మీ అధికారులు విధించే షరతులతో విసిగి వేసారిపోయారు. కంటోన్మెంట్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు రోడ్లపైకి రావాలంటే జంకుతున్నారు. ఏ రోడ్డుపై వెళ్లినా ఏ ఆంక్షలు ఉంటాయో, ఏ రోడ్డులో నో ఎంట్రీ బోర్డు పెడుతారోనని, ఏ రోడ్డు ఎప్పుడు మూసివేస్తారో తెలియక ఆయోమయంలో అక్కడి ప్రజలు ఉన్నారు. ఇక మౌలిక వసతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీధి దీపాలు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలతో నిత్యం మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో మంత్రి కేటీఆర్ సైతం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు ఇక్కడి పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా విన్నవించారు.
అయితే కంటోన్మెంట్ జోన్‌లో రోడ్లు మూసివేయలేదని కేంద్ర మంత్రులు చెప్పడంతో.. ఇటీవల కేటీఆర్ కంటోన్మెంట్ జోన్లలో మూసిన రోడ్లకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. గతంలో కూడా కంటోన్మెంట్ జోన్‌లో రోడ్లు వెడల్పు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అయినప్పటికీ కేంద్రం నుంచి సరైన జవాబు రాలేదు. అయితే ఇప్పుడు అక్కడి ప్రజలు కంటోన్మెంట్ ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో కలపాలని కోరుతున్నారు. మౌలిక వసతులతో పాటు రాష్ట్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్లో కూడా మాకు అన్యాయం జరుగుతోందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇక్కడి పరిస్థితులు చూస్తున్న కొందరు కంటోన్మెంట్ జోన్ మినీ కాశ్మీర్‌లా మారిందా..? అని చర్చించుకుంటున్నారు.