విశాఖలో మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం కొలిక్కిరాలేదు. కలెక్టరేట్‌లో జరిగిన ఇరు వర్గాల చర్చలు విఫలం కావడంతో పంచాయితీ మొదటికొచ్చింది. రాజీ కుదిర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రింగ్ వలల వివాదంపై విశాఖ కలెక్టరేట్‌లో ఆర్డీవో కిషోర్ ఆధ్వర్యంలో ఇరు వర్గాల మత్స్యకారుల సమావేశం జరిగింది.
జీవో ప్రకారం వేట కొనసాగిస్తే… తమకు ఉపాధి దక్కడం కష్టమవుతుందని రింగ్ వలల మత్స్యకారులు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం రింగు వలల మత్స్యకారులు వేటకు చేసుకుంటే తమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు సంప్రదాయ మత్స్యకారులు. అలాకాకుండా ఎనిమిది కిలోమీటర్ల ఇవతల వేట చేస్తామంటే తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదంటున్నారు.
ప్రస్తుతం మత్స్యకార గ్రామాలలో అమలులో ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు ఇరు వర్గాలు. పండగ ముందు వేట చేయకపోతే… తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు నిబంధనల ప్రకారమే రింగు వలల మత్స్యకారులు వ్యవహరించాలని సూచించారు ఫిషరీస్ జేడీ లక్ష్మణరావు. మరోసారి ఇరువర్గాలతో పండుగ అనంతరం చర్చలు జరుపుతామన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 144 సెక్షన్ పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరి ఈవివాదం ఎప్పుడు కొలిక్కి వస్తోందో చూడాలి.