ఒమిక్రాన్ టెన్షన్ ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. డెల్టా నుంచి బయటపడేలోగా ఒమిక్రాన్ వేరియంట్ ఇబ్బందులు పెడుతుండటంతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. డెల్టా వేరియంట్‌లో 8 రకాల మ్యూటేషన్లు ఉంటే, ఒమిక్రాన్‌లో 30 రకాల మ్యూటేషన్లు ఉన్నాయి. అంతేకాదు, డెల్టా వేరియంట్ వ్యాప్తి రేటు 1.47 ఉంటే, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి రేటు 1.97గా ఉంది. ఇదే ఇప్పుడు అందర్ని భయపెడుతున్నది. డెల్టా విజృంభించిన సమయంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదు.
Read: మూన్ మిషన్ 2031 కోసం భారీ బూస్టర్లకు నాసా ఆర్డర్…
ఒమిక్రాన్‌ను జన్యుపరమైన విశ్లేషణ చేసిన సమయంలో స్పైక్ ప్రోటీన్లో విపరీతమైన మార్పులు ఉన్నట్టు వైరాలజిస్టులు గుర్తించారు. ఈ స్పైక్ ప్రోటీన్లు రోగనిరోధక శక్తిని సైతం ఏమార్చగలదని, టీకాలు తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్ సోకదనే గ్యారెంటీ లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 40కి పైగా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడింది. వెయ్యి వరకు కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల వ్యవధిలోనే అనేక దేశాలకు విస్తరించడంతో ఒమిక్రాన్ ఎంత ప్రమాదకరమైన వేరియంటో అర్థం అవుతున్నది.