అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతోంది. పరిటాల-తోపుదుర్తి మాటలతో వేడెక్కిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి టీడీపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో వందల కోట్ల భూఆక్రమణ చేశారు. ఇందుకు రెవెన్యూ అధికారులు సహకరించారు.. కొన్ని ఫోర్జరీ సంతకాలతో చేశారన్నారు. ఈమేరకు సంచలన విషయాలను బయటపెట్టారు.
ఎక్స్ ఆర్మీ, వంక పరంబోకు, అసైన్డ్ ల్యాండ్ భూములను చట్ట బద్ధత చేసి కాజేశారు. వీటిపై ఇటీవల ఆధారాలతో సహా సేకరించానన్నారు. అందుకే బయట పెడుతున్నాను. కురుగుంట, రాచానపల్లి, కొడిమి, ప్రసన్నాయపల్లి ప్రాంతాల్లో భూములు కాజేశారు. 2 వందల కోట్ల రూపాయల భూముల స్కామ్ జరిగింది. మేము బయట పెట్టకుంటే ఏదో ఒక రూట్లో దానిని సెట్ చేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు ఎవరు వెళ్లినా స్టేలు వచ్చేస్తున్నాయి.
ప్రజా ప్రయోజనాలు అసలు చూడటం లేదు.. కోర్టులను అలా మార్చేశారు. ఇప్పటికీ అక్రమాలకు పాల్పడుతూ కొందరు నా పేరు వాడుకుంటున్నారు. ఇలా ఎవరైనా నా పేరు చెబితే చెప్పుతో కొట్టండి.. ఆ తర్వాత నాకు కాల్ చేయండి. ఎవరినీ వదలిపెట్టద్దు.పరిటాల అనుచరులు కూడా నా పేరు వాడుకునే స్థాయికి దిగజారారు. దీనిపై కలెక్టర్ కు చేశాం, త్వరలో సీఎంకు ఫిర్యాదు చేస్తున్నాం. ప్రభుత్వ, దళితుల భూముల ఆక్రమణల గురించి త్వరలో వెల్లడిస్తాం అని ప్రకాష్ రెడ్డి తెలిపారు.