ఏపీలో చేపడుతున్న సంక్షేమ పథకాలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్దిదార్లకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు ఎంపీ మార్గాని భరత్. వన్ టైం సెటిల్మెంట్ పథకం ఒక చక్కని కార్యక్రమం అన్నారు భరత్. ఉరివేయడం, విషం తాగడం అంటూ టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని విమర్శించారు.
సీఎం జగన్ రాష్ట్రంలో పేదలకు లక్షా 25 వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా అందజేశారు. ఎవరి ప్రమేయం లేకుండా బటన్ నొక్కడం ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోకి డబ్బులు జమచేశారన్నారు ఎంపీ భరత్. ఇలాంటి పథకాలను విమర్శిస్తున్న టీడీపీ తీరుని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇళ్లు లేని పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించాలని, వారి ఇళ్లపై వారికి అధికారాలను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్..జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల కుటుంబాలకు 1.58 లక్షల కోట్ల ఆస్తిని ఈ పథకం ద్వారా పేదలకు అందించనుంది ప్రభుత్వం. ఈ పథకం ఉగాది వరకూ కొనసాగనుంది.