ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై ఇటీవల రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను సమర్థించుకున్నారు. తమ దేశ భద్రతను కాపాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఉక్రెయిన్ (Ukraine)లో తమ లక్ష్యాలను సాధించి తీరతామని పుతిన్ (Putin) మరోసారి స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో అతిగా జోక్యం చేసుకుంటే ప్రపంచ అణు సంఘర్షణ ముప్పుతో నిండి ఉన్నాయని పశ్చిమ దేశాలను ఆయన హెచ్చరించారు.
పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు బలగాలను తరలించాలనుకోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని వార్నింగ్ ఇచ్చారు. వారి భూభాగాల్లోని లక్ష్యాలనూ ఛేదించగల ఆయుధాలు తమ దగ్గర కూడా ఉన్నాయని గుర్తుచేశారు. ఆ దేశాల నాయకులు ఇప్పటివరకు ఎటువంటి కఠినమైన సవాళ్లను ఎదుర్కోలేదని.. యుద్ధం అంటే ఏంటో వారు మర్చిపోయారని పుతిన్ విరుచుకుపడ్డారు.