మరో రెండు వారాల్లో ‘మా’ ఎన్నికలు జరగనుండడంతో హడావిడి మొదలైంది. ఇప్పటికే ‘మా’ అధ్యక్షా పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా సివిఎల్ నరసింహ రావు వంటి అభ్యర్థులు ‘మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య ఈ వార్ జరగనుంది. ఇటీవలే ప్రకాష్ రాజ్, విష్ణు తమ ప్యానెల్ లను, అందులో సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ రోజు ఉదయం ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ( MAA ) ఎన్నికల నామినేషన్ వేశారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ కూడా నామినేషన్ వేశారు. నేటి నుంచి నుంచి ఈ నెల 29 వరకూ నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అనంతరం నామినేషన్ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇస్తారు. నామినేషన్ వేసిన వారెవరైనా వెనక్కి తగ్గాలనుకుంటే… అప్పటికే వారు వేసిన నామినేషన్ ను వాపస్ తీసుకోవచ్చు. అక్టోబర్ రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్ 10న ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను కూడా వెల్లడించబోతున్నారు.
Read Also : “పుష్ప” సెకండ్ సింగిల్ అప్డేట్
ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందని ప్రచారం జరుగుతుండగా, మరోవైపు మంచు విష్ణు సైతం మెగాస్టార్, పవన్ ఓట్లు తనకే పడే అవకాశం ఉందని రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో మా సభ్యులు గందరగోళంలో పడిపోయారు. ఇదిలా ఉంచితే ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రధాన ఎజెండా ‘మా భవనం కావడం విశేషం. ఎప్పటి నుంచి ఈ విషయంపై రగడ జరుగుతున్నా ఇంతవరకూ ‘మా’ భవనాన్ని నిర్మించలేకపోయారు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ‘మా’ భవనాన్ని నిర్మించి తీరతామని అటు ప్రకాష్ రాజ్, ఇటు విష్ణు చెబుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరో ? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.