దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత రావడంతో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని వాటిని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. రైతు చట్టాల ఉపసంహరణలో ప్రధాని మోదీ రాజనీతిని ప్రదర్శించారని పవన్ కొనియాడారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ చట్టాలు రైతుల ఆమోదం పొందలేకపోయాయని మోదీ గ్రహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
గురునానక్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని గమనిస్తే జనవాక్కును శిరోధార్యంగా భావించినట్లు అర్థమవుతోందని పవన్ తెలిపారు. పోరాడితే సాధ్యం కానిది ఏమీ ఉండదని రైతులు మరోసారి నిరూపించారని… వ్యవసాయ చట్టాలపై ఏడాదిగా రైతులు చేసిన పోరాటానికి ఫలప్రదమైన ముగింపు లభించిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. రాజకీయ కోణం నుంచి కాకుండా సామాజిక కోణం నుంచి ఆలోచించి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడానికి నిర్ణయం తీసుకున్న బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పవన్ పేర్కొన్నారు.
Read Also: చంద్రబాబు గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చాడు: మంత్రి కొడాలి నాని
మరోవైపు ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల మూలంగా కడప జిల్లా చెయ్యేరు నదిలో వరదలో 30 మంది గల్లంతు కావడం బాధాకరమని పవన్ కళ్యాణ్ తెలిపారు. అన్నమయ్య జలాశయం ఉధృతిని ముందే అంచనా వేసి అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. వరదలో కొట్టుకుపోయినవారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని సమాచారం ఉందని… శివాలయంలో దీపాలు వెలిగించడానికి వెళ్లిన భక్తులు, ఆలయంలో పూజారి కూడా వరదల్లో చిక్కుకున్నారన్న వార్త తనను ఎంతో బాధకు గురిచేసిందని పవన్ పేర్కొన్నారు.