టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మృతి పట్ల జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. శివశంకర్ మాస్టర్ మరణం బాధాకరమని, కరోనా కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని భావించానని పవన్ తెలిపారు. శాస్త్రీయ నృత్యంలో పట్టు ఉన్న ఆయన సినీ నృత్యంలో ఆ పరిజ్ఞానాన్ని మేళవించారని కొనియాడారు. రామ్‌చరణ్ మగధీరలో శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు అందించిన పాట ప్రేక్షకులకు సంతోషాన్ని ఇవ్వడమే కాక ఆయనకు జాతీయ పురస్కారాన్ని అందించడం గొప్ప విషయమన్నారు. శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు లేఖలో పవన్ పేర్కొన్నారు.
మరోవైపు హీరో నందమూరి బాలకృష్ణ కూడా శివశంకర్ మాస్టర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా శివ శంకర్ మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ‘శివ శంకర్ మాస్టర్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయనతో కలిసి కొన్ని చిత్రాలకు పని చేయడం జరిగింది. శివ శంకర్ మాస్టర్ అకాల మృతి పట్ల చింతిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ బాలయ్య పేర్కొన్నారు.