మేగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’తో పాటు దానికి ముందు, తర్వాత కూడా పలు టీవీ సీరియల్స్, సినిమాలు తీసిన నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్. ఇప్పుడీ సంస్థ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి కూడా ప్రవేశించింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘పరంపర’ వెబ్ సీరిస్ శుక్రవారం నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
విశాఖ జిల్లాకు చెందిన వీరనాయుడు (మురళీమోహన్) ప్రజల మనిషి. అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తన సొంత భూమిని ప్రభుత్వానికి ఇవ్వడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని భూమిని కూడా పేద ప్రజలకు దానం చేసిన వ్యక్తి. ఆయన కొడుకులు మోహన రావు (జగపతిబాబు), నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్). నిజానికి అనాథ అయిన మోహన రావును వీరనాయుడు దత్తతు తీసుకుని పెద్ద కొడుకు హోదా ఇస్తాడు. అతన్ని తన రాజకీయ వారసుడిని చేయాలి వీరనాయుడు భావిస్తాడు. కానీ అంతలోనే హత్యకు గురవుతాడు. తమ్ముడు నాగేంద్ర నాయుడు అభిప్రాయానికి విలువ ఇచ్చి మోహనరావు కుటుంబ వ్యవహారాలకే పరిమితమవుతాడు. దాంతో రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు మొత్తం నాగేంద్రనాయుడు చేతిలోకి వెళ్ళిపోతాయి. సెంటిమెంట్‌తో తన తండ్రిని బాబాయ్ పక్కన పెట్టేయడాన్ని మోహనరావు కొడుకు గోపీ (నవీనచంద్ర) తట్టుకోలేకపోతాడు. బాబాయ్ కొడుకు సురేశ్ (ఇషాన్) సైతం రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడని తెలిసి అతనికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒకే ఇంటిలో ఉంటూ ప్రత్యర్థుల్లా వ్యవహరించే అన్నదమ్ములు మోహనరావు – నాగేంద్రనాయుడు; వారి పిల్లలు గోపీ – సురేశ్ మధ్య ఏర్పడిన వైరం వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పిందన్నదే ‘పరంపర’.
అన్నదమ్ముల మధ్య ఉండే అధికార, ఆధిపత్య పోరు నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలానే రాజకీయాలలో అడుగుపెట్టిన తర్వాత రక్త సంబంధాలను సైతం పట్టించుకోకుండా అడ్డగోలుగా ఎదగాలని చూసే వ్యక్తుల జీవితాలూ సినిమాలు వచ్చాయి. దాదాపు అలాంటి కొన్ని సంఘటనల సమాహారమే ఈ వెబ్ సీరిస్. మొత్తం ఏడు ఎపిసోడ్స్ ను మొదటి సీజన్ లో విడుదల చేశారు. ‘ప్రారంభం’ అనే మొదటి ఎపిసోడ్ లో వీరనాయుడు హత్య, తదనంతరం రాజకీయ, వ్యాపార ఆధిపత్యం సొంత కొడుకు నాగేంద్ర నాయుడు చేతిలోకి వెళ్ళడంతో మొదలవుతుంది. అక్కడ నుండి వీరనాయుడు గతం, అతని ప్రత్యర్థులు, మోహన రావును అతను ఏ పరిస్థితుల్లో దత్తతు తీసుకున్నాడు, తమ్ముడి మాటలకు మోహనరావు ఎందుకు కట్టుబడి ఉంటాడు? అనే అంశాలను ‘మూలం, విరోధం, వ్యూహం, చతురం, గతం’ ఎపిసోడ్స్ లో చూపించారు. ఇక చివరి ఎపిసోడ్ ‘వలయం’ గోపీని సొంత తల్లిదండ్రులు, ప్రేమించిన అమ్మాయి సైతం వ్యతిరేకించడంతో ముగిసింది. నిజానికి అసలు ‘పరంపర’కు ఇది మొదలు. అయితే… 30 నిమిషాల నుండి దాదాపుగా గంట నిడివి మధ్య ఉన్న ఈ ఏడు ఎపిసోడ్స్ చూసిన తర్వాత… ఈ మాత్రం కథ చెప్పడానికి ఇంత సమయం వెచ్చించడం అవసరమా!? అనిపిస్తోంది. నాలుగైదు భాగాలలో కుదించి చూపించాల్సిన కథను అనవసరంగా సాగదీశారనిపిస్తుంది. మొదటి ఒకటి రెండు ఎపిసోడ్స్ సాదాసీదాగా, నిరాసక్తకరంగా సాగినా, ఆ తర్వాత నుండి కథ పుంజుకుంటుంది. నాగేంద్ర నాయుడు నిజ స్వరూపం ఏమిటనేది ఎవరికీ అర్థం కాకుండా, ఓ సైకలాజికల్ డ్రామాగా దర్శకులు కృష్ణ విజయ్, విశ్వనాథ్ అరిగెల దీనిని తీశారు. బాబాయ్ పై ఆధిపత్యం చెలాయించాలని చూసే గోపీ… ప్రతి అడుగులోనూ పరాజయం పొందడం, మరీ ముఖ్యంగా చివరి ఎపిసోడ్ లో అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో సీజన్ 2 మీద ఆసక్తి కలిగేలా దర్శకులు చేయగలిగారు.
ఈ వెబ్ సీరిస్ లో మురళీమోహన్, జగపతిబాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఇషాన్, ఆకాంక్ష సింగ్, నైనా గంగూలీ, ఆమని, కస్తూరి వంటి తారలు నటించడం ప్లస్ అయ్యింది. రెగ్యులర్ గా వెండితెరపై కనిపించే నటీనటులు వెబ్ సీరిస్ లో నటించారంటే సమ్ థింగ్ బిగ్ అండ్ సమ్ థింగ్ స్పెషల్ గా ఇది ఉంటుందనే భావన సహజంగానే కలుగుతుంది. జగపతిబాబును ఈ తరహా పాత్రల్లో మనం గతంలో చూశాం. అయితే ఇటు శరత్ కుమార్, అటు నవీన్ చంద్ర దీనిని తమ భుజాలకెత్తుకుని నడిపారు. తండ్రి నుండి ఆధిపత్యాన్ని తన వశం చేసుకునే కపటధారిగా శరత్ కుమార్, తన తండ్రికి జరుగుతున్న అవమానంతో నిత్యం రగిలిపోయే కొడుకుగా నవీన్ చంద్ర బాగా నటించారు. నవీన్ చంద్ర, ఇషాన్ లో ఎవరిని ఎంచుకోవాలో తెలియక సతమతమయ్యే రచన పాత్రలో ఆకాంక్ష సింగ్ బాగా చేసింది. ఇక బాలీవుడ్ వెబ్ సీరిస్ ను స్ఫూర్తిగా తీసుకుని హద్దులు చెరిపేసిన లవ్ మేకింగ్ సీన్స్ ఇందులో రెండు మూడు ఉన్నాయి. నవీన్ చంద్ర, నైనా గంగూలీపై చిత్రీకరించిన వాటిని తొలగించి ఉంటే, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడగలిగే వెబ్ సీరిస్ గా ఇది ఉండేది. ఆ ప్రయత్నం దర్శక నిర్మాతలు ఎందుకు చేయలేదో అర్థం కాదు. జగపతిబాబు భార్యగా ఆమని, ఎమ్మెల్యేగా కస్తూరి, ఎస్పీగా తేజ కాకుమాను, యంగ్ నాగేంద్రగా ప్రవీణ్ యండమూరి – మోహనరావుగా శ్రీతేజ్ బాగా నటించారు. ఇక సీరిస్ చివరిలో తెరపైకి వచ్చి పావులు కదిపే రాజకీయ నేత కృష్ణ ప్రసాద్ పాత్రను కేదార్ శంకర్ పోషించాడు. మనకు చిరపరిచితులే అయిన సూర్య, జోగి బ్రదర్స్, చేతన ఉత్తేజ్, తోటపల్లి మధు, అర్జున్, మేకా రామకృష్ణ, లావణ్య తదితరులు ఇందులో ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. ఆర్కా మీడియా హౌస్ నుండి వచ్చిన వెబ్ సీరిస్ కాబట్టి నిర్మాణ విలువలకు కొదవలేదు. నరేశ్ కుమరన్ నేపథ్య సంగీతం బాగుంది. కానీ మధ్యలో వచ్చే ఒకటి రెండు పాటలు నిజానికి అవసరమే లేదు. అవన్నీ అనవసరపు హంగులు, కథాగమనానికి అడ్డం వచ్చేవే. స్ట్రీమింగ్ అవుతోంది ఓటీటీలో కాబట్టి, చూసేవాళ్ళు బోర్ కొడితే, ఎలానూ స్కిప్ చేసుకుంటారులే అనే భావనతో వాటిని అలానే ఉంచేశారేమో తెలియదు. కానీ అలాంటి వాటిని పరిహరించి, టైట్ గా ఎడిటింగ్ చేసి నాలుగు ఎపిసోడ్స్ కు దీన్ని కుదించి ఉంటే బాగుండేది. చెప్పుకునేంత కొత్తదనం ఇందులో లేకపోయినా టైమ్ పాస్ కు ‘పరంపర’ను చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్
పాపులర్ ఆర్టిస్టులు నటించడం
ఆసక్తి రేకెత్తించే కథ, కథనం
ప్రొడక్షన్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఎక్కువ
బలహీనమైన సన్నివేశాలు
ఓవర్ గా అనిపించే డ్రామా
రేటింగ్: 2.75 / 5
ట్యాగ్ లైన్: అసలు కథ మిగిలే ఉంది!