Pakistan PM: కశ్మీర్ వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో నిజాయితీతో, చిత్తశుద్ధితో కూడిన చర్చలు జరగాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. దుబాయ్‌కి చెందిన అల్ అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షరీఫ్ మాట్లాడుతూ.. భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని, ఇప్పుడు పొరుగుదేశంతో శాంతిని కోరుకుంటున్నట్లు నొక్కి చెప్పారు. శాంతియుతంగా జీవించడం, అభివృద్ధి కోసం పరస్పర సహకారం అవసరమని ఆయన అన్నారు. సమయం, వనరులను వృధా కాకుండా కాపాడుకోవచ్చని ఆయన అన్నారు. పాకిస్తాన్ శాంతిని కోరుకుంటోందని.. అయితే కశ్మీర్‌లో జరుగుతున్న వాటిని ఆపాలని అన్నారు. పాకిస్థాన్ బాంబులు, మందుగుండు సామగ్రి కోసం వనరులు వృధా చేయాలనుకోవట్లేదని ఆయన ఇంటర్వ్యూలో వెల్లడించారు. యుద్ధం జరిగితే ఏం జరిగిందో చెప్పడానికి ఎవరు మిగిలి ఉంటారని ఆయన అన్నారు.
పాకిస్తాన్ భారత్‌తో మూడు యుద్ధాలు చేసిందని.. అవి ప్రజలకు మరిన్ని కష్టాలు, పేదరికం, నిరుద్యోగాన్ని మాత్రమే తీసుకువచ్చాయన్నారు. తాము గుణపాఠం నేర్చుకున్నామని.. సమస్యలను పరిష్కరించుకోగలిగితే తాము భారత్‌తో తాము శాంతియుతంగా జీవించాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాకిస్తాన్, పిండి సంక్షోభం, ఇంధన కొరత కారణంగా ప్రభుత్వ పాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిషేధిత సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP ఉగ్రవాద దాడులను కూడా పాక్ ఎదుర్కొంటోంది. గత ఏడాది చివర్లో దేశ భద్రతా దళాలతో టీటీపీ కాల్పుల విరమణను ముగించింది.
Dawood Ibrahim: కరాచీలో దావూద్ ఇబ్రహీం మళ్లీ పెళ్లి చేసుకున్నాడట..!
గత ఏడాది నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి చర్చలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తినందుకు పాకిస్తాన్‌పై భారతదేశం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అబద్ధాలను ప్రచారం చేయడానికి పాక్ ప్రయత్నిస్తోందని భారత్ మండిపడింది. జమ్మూ కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కీలకమైన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాకిస్థాన్ వాదనలపై భారత్ స్పందించింది.