భారత్‌లో త్వరలోనే విద్యుత్ సంక్షోభం రాబోతోంది.. దానికి ప్రధాన కారణం బొగ్గు కొరతే అనే వార్తలు గుప్పుమన్నాయి.. దానికి తగినట్టుగా కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేయడం.. బొగ్గు కొరతపై ప్రకటన చేయడం.. విద్యుత్ సంక్షోభానికి దారితీసి నాలుగు పరిణామాలు ఇవేనంటూ ప్రకటించడం జరిగిపోయాయి.. అయితే, బొగ్గు కొరత ఉందంటూ వస్తులను వార్తలను కొట్టిపారేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ వార్తలు పూర్తిగా నిరాధారం అని క్లారిటీ ఇచ్చిన ఆమె.. భారత్ మిగులు విద్యుత్ గల దేశం అని స్పష్టం చేశారు. విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్ కేవలం రెండు రోజుల క్రితం నాటి రికార్డుల ఆధారంగా.. బొగ్గు కొరతపై మాట్లాడి ఉంటారని తెలిపిన నిర్మలా సీతారామన్.. కానీ, అది నిరాధారం అంటూ హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న సందర్భంగా వివరణ ఇచ్చారు.
మరోవైపు.. వచ్చే 4 రోజుల వరకు దేశంలోని ప్రతి పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌లో ఎటువంటి అంతరాయం ఏర్పడలేదన్నారు నిర్మలా సీతారామన్.. మొసవర్-రహ్మానీ సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ గవర్నమెంట్ నిర్వహించిన సంభాషణలో, సీతారామన్‌ను హార్వర్డ్ ప్రొఫెసర్ లారెన్స్.. విద్యుత్ కొరత గురించి, భారత్‌లో బొగ్గు నిల్వలు తగ్గిన పోయిన నివేదిక గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇలా స్పందించారు నిర్మలా సీతారామన్.. విద్యుత్, బొగ్గు సరఫరాలో కొరతకు దారితీసే ఏ లోపాలు ఉండదని.. భారతదేశ విద్యుత్ పరిస్థితిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం.. మనం ఇప్పుడు విద్యుత్ మిగులు దేశంగా ఉన్నామన్నారు. మరోవైపు కోవిడ్‌పై పోరాటంలో భాగంగా భారత ప్రభుత్వం బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్ కు ఎలా చేరువ అయ్యిందనే విషయంపై మాట్లాడుతూ.. దేశంలో గ్రామ స్థాయి వరకు, ప్రాథమిక ఆరోగ్యం కోసం నిర్మించిన కేంద్రాలు ఉన్నాయని.. అవి ప్రాథమిక సంరక్షణ యొక్క అవసరాలకు ఉపయోపడుతున్నాయన్నారు.. ఈ కేంద్రాలు సంవత్సరాలుగా నవజాత శిశువులకు టీకాలు వేయడం ప్రారంభించాయి.. పోలియో వ్యాప్తిని అరికట్టడంలో భారతదేశం చాలా విజయవంతమైందని ఆమె చెప్పారు. ఇక, టీకాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే, మా వ్యవస్థలను సిద్ధం చేశాం.. కొన్ని సుదూర ప్రాంతాలకు కూడా వెళ్లి ప్రజలకు వ్యాక్సిన్ అందించాం.. భారతదేశంలో సంస్థాగత ఏర్పాటు అనేది చాలా సంవత్సరాలుగా నిర్మించబడిన ఫ్రేమ్‌వర్క్ అని ఆమె చెప్పారు. దేశాలతో కొన్ని ద్వైపాక్షిక ఏర్పాట్ల ద్వారా భారత్ ఉచితంగా టీకాలు ఇస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు నిర్మలా సీతారామన్.