నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపట్టిన ఉద్యమంపై కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారం ఇవ్వాలని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ‘రైతులు చనిపోయారా? మాకు తెలియదే… పరిహారం ఎలా ఇస్తాం?’ అంటూ రైతు ఉద్యమాన్ని అవమానపరిచేలా సమాధానం ఇచ్చారు. రైతులు చేపట్టిన ఉద్యమంలో ఎంత మంది రైతులు చనిపోయారనే విషయంపై తమ వద్ద ఎలాంటి రికార్డు కానీ, డేటా కానీ లేదని పార్లమెంట్ సాక్షిగా ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో ఏ ఒక్కరికీ పరిహారం చెల్లించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
Read Also: జీఎస్టీ వసూళ్లపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన
నిరసనలు ఆపాలని తాము రైతు సంఘాలను పలుమార్లు కోరామని.. వ్యవసాయ చట్టాలపై 11 సార్లు చర్చలు కూడా జరిపామని కేంద్రమంత్రి తోమర్ గుర్తుచేశారు. అయితే ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు చనిపోయారని రైతు సంఘాలు, విపక్షాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్లో ఎక్కువ మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా రైతు ఉద్యమంలో చనిపోయిన 750 మందికి రూ. 3 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు రైతుల పంటకు కనీస మద్దతు ధర చట్టం అమలు చేస్తారా? అని ఓ ఎంపీ ప్రశ్నించగా.. 22 రకాల పంటలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించిందని మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానమిచ్చారు.