కేంద్రం ఆదాయం కోసం దేన్నీ వదలడం లేదు. తాజాగా కేంద్రం టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ రేటు పెంచాలని భావించింది. అయితే వస్త్ర వ్యాపారుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా ఆ నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీపికబురు అందించారు. టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ రేటు పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది. అదేసమయంలో కొనుగోలు దారులకు కూడా ఊరట కలుగనుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెక్స్ టైల్స్ పై జీఎస్‌టీ రేటు పెంపును వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వపు జీఎస్‌టీ రేటు పెంపు వల్ల టెక్స్‌టైల్స్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని ట్రేడ్ యూనియన్లు చాలా కాలం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలకు కూడా దిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెక్స్‌టైల్స్‌పై జీఎస్‌టీ రేటు పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ ట్యాక్స్ పెంపు నిర్ణయం ప్రకటించింది. ఈ పెంపు వాస్తవంగా 2022 జనవరి 1 నుంచి అమలులోకి రావాల్సి వుంది. అయితే ఇప్పుడు జీఎస్‌టీ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఫిబ్రవరి నాటి జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయానికి రావచ్చని తెలుస్తోంది. ఫుట్‌వేర్‌పై జీఎస్‌టీ రేటు పెంపు మాత్రం అమలులోకి రాబోతోంది. వీటిపై జీఎస్‌టీ 5 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. జనవరి 1 నుంచి అధిక జీఎస్‌టీ చెల్లించుకోవాలి. దీని వల్ల ఫుట్‌వేర్ ధరలు పెరిగే అవకాశం వుంది.