NTV Telugu Site icon

రివ్యూ: ‘నవరస’ (ఆంథాలజీ)

విలక్షణ దర్శకుడు మణిరత్నం ఏది చేసినా అందులో ఏదో ఒక వైవిధ్యం చోటు చేసుకుంటుంది. జయేంద్ర పంచపకేశన్ తో కలసి మణిరత్నం నిర్మించిన వెబ్ సీరీస్ ‘నవరస’ ఆగస్టు 6 నుండి నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. మణిరత్నం అందించిన సిరీస్ కదా, తెలుగువారికి మొదటి నుంచీ ఆసక్తి కలుగుతోంది. అందుకు తగ్గట్టుగానే తెలుగులోనూ అనువాదమయింది ‘నవరస’. పదాలు తెలుగులోనే వినిపించినా, పాటలు మాత్రం తమిళంలోనే వినిపిస్తాయి. కంగారు పడకండి! ఈ ‘నవరస’ తొలి ఎపిసోడ్ కరుణతో ఆరంభమై, శృంగారంతో ముగుస్తుంది. ఒక్కోరసాన్ని ఒక్కో దర్శకుడు రూపొందించారు. ఒక్క చివరి ఎపిసోడ్ మినహాయిస్తే అన్నీ 30 నిమిషాలకు కాస్త అటు ఇటుగానే ఉన్నాయి. అయినా చూసేవారి ఓర్పును కొన్ని ఎపిసోడ్స్ పరీక్షిస్తాయి. ఎంత మణిరత్నంపై అభిమానం ఉన్నా, తెలుగులోనే పదాలు వినిపిస్తున్నా, అసలే ఇది ఓటీటీ ఐటమ్ కాబట్టి, ప్రేక్షకుడు రిమోట్ తో కొన్నిటిని ఫార్వర్డ్ చేయకుండా ఉండలేడు.

‘ఎదిరి’ అనే ఫస్ట్ ఎపిసోడ్ లో కరుణరసం కురిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు బిజయ్ నంబియార్. ఇందులో ప్రకాశ్ రాజ్ ను విజయ్ సేతుపతి హత్య చేస్తాడు. పశ్చాత్తాపంతో ఆయన భార్య రేవతిని వెళ్ళి క్షమించమని అడుగుతాడు. పదేళ్ళ క్రితమే ఆయనతో మాట్లాడటం మానేసి, తానెప్పుడో అతణ్ణి చంపేశానని చెబుతుంది రేవతి. ఇక రెండో ఎపిసోడ్ హాస్యంతో నిండిన ‘సమ్మర్ ఆఫ్ 92’. స్కూల్ లో 9వ తరగతి నాలుగేళ్లు చదివినా పాసుకాని యోగిబాబు పెద్ద కమెడియన్ అయిఉంటాడు. అతణ్ణి ఆహ్వానించి స్కూల్ సన్మానిస్తుంది. అక్కడ తన టీచర్ లక్ష్మిని చూస్తాడు. గతం గుర్తుకు వస్తుంది. తన కారణంగానే ఆమె పెళ్ళి చెడిపోయిందని తెలుస్తుంది. క్షమించమని ఆమె కాళ్ళ మీద పడతాడు. చివరలో ఆమె చెప్పే అంశమే మనకు నవ్వు పుట్టిస్తుంది. అదే అందులోని హాస్యం. దీనికి ప్రియదర్శన్ దర్శకుడు. మూడో ఎపిసోడ్ ‘ప్రాజెక్ట్ అగ్ని’. ఇందులో అద్భుతరసం ఉంది. దీనికి కార్తీక్ నరేశ్ నిర్దేశకుడు. అరవింద్ స్వామి, ప్రసన్న, పూర్ణ ప్రధాన పాత్రధారులు. మన మెదడు, దాని ప్రయాణం, చేతన, అచేతన, అంతఃచేతన మధ్య సాగుతుంది కథ. మెదడు అంటేనే అద్భుతం. కాబట్టి ఆ రసం ఉందని అంగీకరిద్దాం.

నాలుగోది బీభత్సం అంటే అసహ్యం. ఈ ఎపిసోడ్ పేరు పాయసం. తనను ఎంతో గౌరవించి, ఆస్తి కూడా ఇచ్చిన అన్న కొడుకు అంటే ఓ పెద్దాయనకు అసహ్యం. ఎందుకంటే అన్నకొడుకు కూతుళ్లకు మంచి సంబంధాలతో పెళ్ళిళ్లు అవుతుంటాయి. తన కూతురుకు వైధవ్యం. దాంతో అన్నకొడుకు అంటే అసహ్యం. అన్నకొడుకు చిన్నకూతురు పెళ్ళికి వెళ్లి, పెళ్ళయ్యాక అందరూ పాయసం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని తెలుసుకుంటాడు. తాళి కట్టే సమయంలో వంటవాళ్లందరూ చూడటానికి వెళ్తే, పాయసం నేలపాలు చేస్తాడు పెద్దమనిషి. అది ఆయన కన్నకూతురే చూస్తుంది. ఇందులో ఢిల్లీ గణేశ్, రోహిణి, అదితీ బాలన్ నటించారు. ఇక ఐదో ఎపిసోడ్ ను కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించాడు. ఇది శాంతరసం. టైటిల్ కూడా ‘పీస్’. వైరి వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకొనే పరిస్థితి. లంక సేన, ఎల్టీటీ మధ్య పోరు. ఓ బాలుడి కుక్కపిల్లను ప్రాణాలకు తెగించి ఓ వ్యక్తి కాపాడతాడు. ఆ సమయంలో వైరివర్గాలు తనపై కాల్పులు జరపలేదని థ్యాంక్స్ చెప్పడానికి పూనుకుంటాడు. అప్పుడు జరుగుతాయి కాల్పులు. బాబీ సింహా, గౌతమ్ వాసుదేవ మీనన్ ప్రధాన పాత్రధారులు. ఆరో ఎపిసోడ్ ‘రౌద్రం’. రసమూ అదే. నటుడు అరవింద స్వామి దర్శకుడు. పేరుకు రౌద్రంతో ఆరంభమైనా, చివరకు మనసులు తడిచేస్తుంది ఈ ఎపిసోడ్. ఎ. ఆర్. రహమాన్ నేపథ్య సంగీతం పలికించారు.

భయానక రసం పలికిస్తూ ఏడో ఎపిసోడ్ ‘ఇమ్మయ్’ వసంత్ దర్శకత్వంలో రూపొందింది. సిద్ధార్థ్, పార్వతి తిరువొతు ప్రధాన పాత్రధారులు. చేతబడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎపిసోడ్ లో కొత్తగా చెప్పే ప్రయత్నం చేసినా, పాత చింతకాయ పచ్చడే అనిపిస్తుంది. సర్జున్ కె.ఎమ్. దర్శకత్వంలో ఎనిమిదో ఎపిసోడ్ వీర రసంతో అలరించే ప్రయత్నం చేసింది. అథర్వ, అంజలి, కిశోర్ ప్రధాన పాత్రధారులు. భర్త కోసం వేచి ఉండే నిండు గర్భిణి పాత్రలో అంజలి కనిపించింది. అథర్వ తనకు దొరికిన టెర్రరిస్ట్ ను వెంటాడే ప్రయత్నంలో కథ ముగుస్తుంది. ఇక్కడా మనకు మణిరత్నం రోజా, అమృత లాంటివి గుర్తుకు వస్తాయి. అలా గుర్తు రానివారికి కొత్తగానే అనిపించవచ్చు. ఇక చివరి రసంగా శృంగారం రంగరించారు. ఈ ఎపిసోడ్ టైటిల్ ఏంటంటే, “గిటార్ కంబి మేలే నిండ్రు”. సూర్య, ప్రయాగ రోజ్ మార్టిన్ నటించారు. దీనికి గౌతమ్ వాసు దేవమీనన్ దర్శకుడు. తన చిత్రాలలో ఇంతకు ముందు సున్నితమైన శృంగారాన్ని, సంభాషణల రూపంలో చక్కగా తెరకెక్కించారు గౌతమ్. అదే తీరున ఈ ఎపిసోడ్ నూ సాగేలా చేశాడు. సూర్య గెటప్ వరైటీగా ఉంది. అతనో మ్యూజిక్ కంపోజర్. అతని మ్యూజిక్ ను ఆరాధించే అభిమాని, గాయనిగా ప్రయాగ నటించింది. గమనిస్తే, ఆమె చాలా చోట్ల సూర్యను డామినేట్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ పెద్దదే అయినా, చూపరులను ఆకట్టుకొనేలా చిత్రీకరించారు. దీని ముగింపు కూడా విషాదమే.

‘నవరస’ లోని తొమ్మిది ఎపిసోడ్స్ లోనూ కెమెరా పనితనాన్ని అభినందించి తీరాలి. పి.సి. శ్రీరామ్, సంతోష్ శివన్, సత్యన్ సూర్యన్, సుజిత్ సారంగ్, ఎన్.కె. ఏకాంబరం వంటి వారితో పాటు సుదర్శన్ శ్రీనివాసన్, శ్రేయాస్ క్రిష్ణ, హర్షవీర్ ఓబెరాయ్, విజయ్ తమ కెమెరా పనితనం చూపించారు. మూడ్ కు తగ్గ లైటింగ్ తో ఆకట్టుకున్నారు. నేపథ్య సంగీతం కూడా ఎవరికి తగ్గ స్థాయిలో వారు పలికించారు. శృంగారరసం పలికించిన చివరి ఎపిసోడ్ లో కథానుగుణంగానే పాటలు ఉంటాయి. మరికొన్ని ఎపిసోడ్స్ లోనూ నేపథ్యగీతాలు వినిపిస్తూంటాయి. తమిళమే వినిపిస్తుంది. తొందరపడి అపార్థం చేసుకోకండి. తెలుగు పాటలు రూపొందించడానికి కావలసినంత సమయం లేదేమో! ఈ ఫస్ట్ సీజన్ లోని నవరస ద్వారా వచ్చే లాభాల్లో దక్షిణ సినిమా ఫెడరేషన్ కార్మికుల సహాయనిధికి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఓటీటీలో మరి ఎంతమందిని ఈ నవరస ఆకట్టుకుంటుందో చూడాలి.

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్
ఆకట్టుకునే సాంకేతిక విలువలు
పేరున్న నటీనటులు ఉండటం
అలరించే చివరి ఎపిసోడ్

మైనెస్ పాయింట్స్
చిన్న కథలను సాగతీయడం
పాటలు తమిళంలో ఉండటం
కొన్ని రసాలు కుదరక పోవడం

ట్యాగ్ లైన్: కొంత పస… కొంత నస…