నాని హీరోగా నటించిన ‘టక్ జగదీశ్’ మూవీ విడుదల సైతం వాయిదా పడింది. ఈ విషయాన్ని నానినే స్వయంగా ఓ వీడియో ద్వారా తెలిపాడు. ఉగాదికి ఈ సినిమా ట్రైలర్ రావడం లేదని, సినిమా కూడా 23 నుండి కాస్తంత వెనక్కి వెళుతోందని స్పష్టం చేశాడు. త్వరలో వచ్చే ట్రైలర్ లోనే సినిమా విడుదల తేదీ ఉంటుందని చెప్పాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. నాని సరసన రీతువర్మ నాయికగా నటించగా, జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతాన్ని అందించాడు. ఉగాది కానుకగా ఈ సినిమా ట్రైలర్, ఈ నెల 23న సినిమా విడుదల కావాల్సి ఉంది. ‘జనవరిలో ‘క్రాక్’తో మొదలు పెట్టి నిన్నటి ‘వకీల్ సాబ్’ వరకూ పలు చిత్రాలను తెలుగు సినిమా ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారని, అయితే… ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత వెనక్కి వెళుతున్నామ’ని నాని తెలిపాడు. రీ-రికార్డింగ్ కూడా బాగా వస్తోందని చెప్పాడు. అందరూ ఉగాది పండగను సేఫ్ గా జరుపుకోవాలంటూ నాని శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పటికే ఈ నెల 16న రావాల్సి ఉన్న ‘లవ్ స్టోరీ’ని వాయిదా వేశారు. ఇప్పుడు 23న రాబోతున్న ‘టక్ జగదీశ్’ సైతం వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఈ లెక్కన మిగిలిన సినిమాలు సైతం ఇలానే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కనబడుతోంది.
Hi 🙂 #TuckJagadishPostponed pic.twitter.com/byQwprFTHA
— Nani (@NameisNani) April 12, 2021