(జూన్ 13న జి.వి. ప్రకాశ్ కుమార్ బర్త్ డే)
మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తే పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని అంటారు. సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాశ్ కుమార్ ను చూస్తే, ఆ నానుడి నిజమే అనిపిస్తుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ అక్క రెహనా ఏకైక కుమారుడే ప్రకాశ్ కుమార్. రెహనా కూడా గాయని. తల్లి, మేనమామ బాటలోనే ఆరంభంలో ప్రకాశ్ గళం విప్పి పాటలు పాడేవాడు. మేనమామ స్వరకల్పన చేసిన పలు చిత్రాలలో ప్రకాశ్ కుమార్ గాత్రం వినిపించింది. రహమాన్ స్వరాలతోనే పలు విజయాలు చూసిన డైరెక్టర్ ఎస్.శంకర్ తన సొంత చిత్రం ‘వెయిల్’ ద్వారా జి.వి. ప్రకాశ్ కుమార్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేశారు. ఆ సినిమాలోని పాటలు యువతను ఆకట్టుకున్నాయి. దాంతో రహమాన్ బాణీలు కుదరని వారంతా జి.వి.ప్రకాశ్ స్వరాల వెంట పరుగులు తీశారు. తన దరికి చేరిన సినిమాలకు న్యాయం చేస్తూ పలు మ్యూజికల్ హిట్స్ అందించారు జి.వి.ప్రకాశ్. తెలుగులో కరుణాకరన్ రూపొందించిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ స్వరకల్పన చేశాడు. ప్రభాస్ ‘డార్లింగ్’, రామ్ ‘ఎందుకంటే ప్రేమంట’ , ‘ఒంగోలు గిత్త’, శర్వానంద్ ‘రాజాధిరాజా’ , నాని ‘జెండాపై కపిరాజు’ చిత్రాలకు కూడా ప్రకాశ్ స్వరకల్పన చేసి అలరించారు. ఇవి కాకుండా తమిళంలో ప్రకాశ్ సంగీతం సమకూర్చిన చిత్రాలు తెలుగులోకి అనువాదమైనప్పుడు కూడా ఆయనే బాణీలు పలికించాడు. ఆ డబ్బింగ్ మూవీస్ తోనూ తెలుగువారిని ఆకట్టుకున్నాడు ప్రకాశ్.
మామకంటే రెండాకులు ఎక్కువే చదివాడు జి.వి.ప్రకాశ్ కుమార్. రహమాన్ సంగీత దర్శకునిగా, గాయకునిగా, గీత రచయితగా సాగితే, ప్రకాశ్ నటనలోనూ అడుగు పెట్టి ఆకట్టుకున్నాడు. రజనీకాంత్ ‘కథానాయకుడు’లో తొలిసారి తెరపై కనిపించిన ప్రకాశ్, తరువాత పలు చిత్రాలలో అతిథి పాత్రల్లో నటించాడు. ‘పెన్సిల్’ చిత్రంతో హీరో అయ్యాడు. కానీ, ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగింది. తెలుగులో విజయం సాధించిన ‘ప్రేమకథా చిత్రం’ ఆధారంగా రూపొందిన ‘డార్లింగ్’లో తొలిసారి జనం ముందు హీరోగా కనిపించాడు ప్రకాశ్. ఆ సినిమా మంచి ఆదరణ పొందడంతో నటునిగానూ ప్రకాశ్ బిజీ అయిపోయాడు. “త్రిష ఇల్లనా నయనతార, ఎనక్కు ఇన్నొరు పేర్ ఇరుక్కుమ్, కడవుల్ ఇరుకాన్ కుమారు” వంటి చిత్రాలతో హీరోగానూ ప్రకాశ్ మంచి మార్కులు సంపాదించేశాడు. దాదాపు డజన్ చిత్రాలలో ప్రస్తుతం నటిస్తున్నాడు ప్రకాశ్. వాటిలో ఓ ఇంగ్లిష్ మూవీ కూడా ఉండడం విశేషం. ఏదైనా అటు సంగీత దర్శకునిగా, ఇటు నటునిగా రాణిస్తున్న ప్రకాశ్ కుమార్ మునుముందు ఇంకా ఏ తీరున అలరిస్తాడో చూడాలి.