మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులకు సీఎం కేసీఆర్ కీలక పదవి కట్టబెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.. తెలుగు దేశం పార్టీలో ఉండగానే టీఆర్ఎస్‌లో చేరేందుకు అప్పట్లో మోత్కుపల్లి ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరిగింది.. కానీ, ఆయనను పార్టీలో చేర్చుకోవడం కొందరికి ఇష్టం లేకపోవడంతో.. ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.. అయితే, సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించగానే.. పరిస్థితి మారిపోయింది… సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి వెళ్లొద్దని బీజేపీ నిర్ణయం తీసుకున్నా… మోత్కుపల్లి మాత్రం హాజరయ్యారు.. ఆ తర్వాత పార్టీకి రాజీనామా కూడా చేసి.. ప్రస్తుతం ఏ పార్టీలో చేరకుండా.. సీఎం కేసీఆర్‌ను అవకాశం దొరికినప్పుడల్లా ఆకాశానికి ఎత్తుతున్నాడు. కానీ, అతి త్వరలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని టాక్ నడుస్తోంది.. అంతేకాదు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకానికి ఛైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులును నియమిస్తారని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.
మరో మూడు నాలుగు రోజుల్లో మోత్కుపల్లి… టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని సమాచారం… ఆయన గులాబీ కండువా కప్పుకోగానే.. దళిత బంధు పథానికి చైర్మన్‌గా… స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి స్పష్టమైన హామీ వచ్చినట్టు సమాచారం అందుతుండగా.. దానికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా.. ఇవాళ ఉదయం అసెంబ్లీకి స్వయంగా మోత్కుపల్లి నర్సింహులను వెంటబెట్టుకొట్టారు సీఎం కేసీఆర్.. ఉదయం నుండి సీఎం కేసీఆర్ తోనే అసెంబ్లీలో ఉండిపోయారు మోత్కుపల్లి… దళిత బంధు పథకంపై కీలక చర్చ, సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణను మోత్కుపల్లి నిశితంగా గమనించినట్టు తెలుస్తోంది. మొత్తంగా.. మోత్కుపల్లి కారు ఎక్కడం… ఆ వెంటనే దళిత బంధు చైర్మన్ పదవి కూడా దక్కించుకోవడం… లాంటి పరిణామాలు వేగంగా మారుతాయని చర్చ మొదలైంది.