టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఒక్కొక్క సినిమా పూర్తి చేయటానికి సంవత్సరం పైగా పడుతోంది. ఇక మన టాప్ డైరెక్టర్స్ కూడా అందు తగ్గట్లే చెక్కుతూ తెరకెక్కిస్తున్నారు. దాంతో అనుకున్న బడ్జెట్ సైతం 40 శాతం అంతకు మించి పెరిగిపోతూ వస్తోంది. అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. తనతో పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమా చేసే దర్శకులకు సంపూర్ణంగా సహకరిస్తూ అతి తక్కువ కాలంలోనే షూటింగ్ పూర్తి చేస్తున్నారు. తాజాగా మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రో డాడి’ సినిమాను 44 రోజుల్లో పూర్తి చేశారు మోహన్ లాల్.
మోహన్ లాల్, పృథ్వీరాజ్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘లూసిఫర్’ మలయాళ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించటమే కాదు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రీమేక్ అవుతోంది. అంతటి విజయం తర్వాత కూడా ఈ స్టార్స్ ఇద్దరూ తమ సినిమాను రికార్డ్ టైమ్ లో పూర్తి చేయటం విశేషం. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరిగింది. దర్శకుడిగా పృథ్వీరాజ్ కి ఇది రెండవ చిత్రం. మోహన్ లాల్ తో పాటు దర్శకత్వం వహిస్తూ సినిమాలో కీలక పాత్ర పోషించారు పృథ్వీరాజ్. ఇక మీనా, కళ్యాణి ప్రియదర్శన్, ఉన్ని ముకుందన్, లాలూ అలెక్స్, మురళీ గోపీ, కనిక, సాబిన్ షాహిర్ వంటి బీజీ ఆర్టిస్ట్ లతో సినిమాను లావిష్ గా కూడా తెరకెక్కించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మోహన్ లాల్ నెంబర్ వన్ హీరో. ప్రస్తుతం మొత్తం ఏడు సినిమాలు చిత్రీకరణ లో ఉన్నాయి. వాటిలో భారీ చిత్రాలున్నాయి. ‘మరక్కార్, ఆరాట్టు, రామ్, బారోజ్, 12th మేన్, బ్రో డాడీ, L2- ఎంపురాన్’ వంటి వాటితో పాటు మరి కొన్ని సినిమాలు పట్టాలెక్కవలసి ఉంది. పృథ్వీ రాజ్ సుకుమార్ కూడా ప్రస్తుతం 12 సినిమాలలో నటిస్తున్నాడు. 2022 చివరి వరకూ ఆయన డేట్లు దొరకని పరిస్థితి. ఇంత బిజీగా ఉంటూ కూడా వారిద్దరి కలయికలో సినిమాను 44 రోజుల్లోనే పూర్తి చేశారు. మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం2’ని కూడా 46 రోజుల్లోనే పూర్తి చేయటం గమనించదగ్గ విషయం.
మన టాలీవుడ్ కి వస్తే టాప్ హీరోలతో పాటు ఒక్క హిట్ ఇచ్చిన హీరోలు సైతం ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తూ, భారీగా ఖర్చు పెడితేనే క్వాలిటీతో తీస్తున్నామనే భ్రమతో ఉంటున్నారు. కోవిడ్ రాకాసి వచ్చిన తర్వాతైనా మార్పు వస్తుందనుకుంటే… మారలేదు సరికదా! ఇంకా చెక్కుడు పెంచటంతో పాటు పారితోషికాలను సైతం పెంచేసి నిర్మాతలపై అదనపు భారం మోపేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడే సినిమా నిర్మాణ వ్యయం 30 నుంచి 50 శాతం పెరిగిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పోనీ నిర్మాతలకేమైనా మిగులుతుందా? అంటే నాస్తి. కొద్దో గొప్పో మిగులుతుందనే హింట్ వచ్చినా చాలు ప్రచారం పేరుతో దానిని కరిగించేస్తున్నారు. మోహన్ లాల్ వంటి వారిని చూసైనా మన హీరోలలో మార్పు వస్తుందా? అంటే… కనీసం వారిని చెడగొట్టకుండా ఉంటే చాలనే వారూ లేకపోలేదు. కనీసం ఇకనైనా మన వారు మారి పారితోషికాలు, షూటింగ్ డేస్ తో పాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గించుకుంటారేమో చూడాలి.