అవును ఒక్క సవాల్ ఎన్నో కష్టాలు తెచ్చిపెడుతోంది. రాజకీయాల్లోకి వచ్చాక సవాలక్ష సవాళ్ళు, ఆరోపణలు చేస్తుంటాం. అంత మాత్రాన మాట మీద నిలబడమంటే ఎలా. అచ్చం ఇలాంటి బాధలోనే వున్నారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా బాలరాజు చేసిన సవాల్ ఆయన పాలిట శాపంగా మారింది. రాజకీయనేతలు తమ సవాళ్ళు మరిచిపోతారు కానీ ప్రజలు పట్టించుకున్నప్పుడే సమస్య వస్తుంటుంది. ఇప్పుడు అదే సమస్య టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వచ్చింది. ఆయన అన్న ఓ మాటను ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో అయితే అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా గువ్వల బాలరాజు సవాల్ విసిరారు. ఈటల అక్కడ గెలిస్తే రాజీనామా చేస్తానన్నారు. ఈటల గెలవడంతో ఆయన సవాల్ ని కొందరు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మీరు రాజీనామా ఎప్పుడు చేస్తారంటూ అదే పనిగా ఫోన్ చేసి మరీ అడుగుతుండడంతో తల పట్టుకుంటున్నారు ఎమ్మెల్యే బాలరాజు. ఈ ఫోన్ కాల్స్ దెబ్బకు ఆయనకు బీపీ పెరిగి అప్పుడప్పుడు కొంత మందిని చెడామడా తిట్టేస్తున్నారు. పాపం వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో బాలరాజు బాధ అంతా ఇంతా కాదు.
ఈటల గెలిస్తే రాజీనామా చేస్తానన్న గువ్వల బాలరాజు మాట నిలబెట్టుకోవాలని సోషల్ మీడియాలో క్యాంపైన్ నడుస్తోంది. గద్వాల నుండి ఓ బీజేపీ కార్యకర్త ఇలాగే ఫోన్ చేసి అడిగే సరికి ఆయన బీపీ పెరిగిపోయింది. ఆయన అనరాని మాటలన్నారు. ఆ ఆడియోను ఆయన ఆన్ లైన్‌లో పోస్ట్ చేశారు. అవన్నీ వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో అనేక మంది సవాళ్లు చేస్తారని అంత మాత్రాన ఇలా వెంట పడటం ఏమిటని బాలరాజు బాధపడుతున్నారు. ఈ బాధ పంచుకునేవారే కరువయ్యారు. ఈ ఫోన్ కాల్స్ దెబ్బతో ఆయన అసలు ఫోన్ తీయడానికి భయపడిపోతున్నారు.
ఇదిలా వుంటే.. ఎమ్మెల్యే గువ్వల బాల రాజుకి కాల్ చేసి అసభ్యంగా మాట్లాడి వాట్సప్ లో వైరల్ చేసిన హుజూరాబాద్ మండలం సింగపూర్ కు చెందిన కుమార్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేశారు హుజూరాబాద్ పోలీసులు. సోషల్ మీడియా పై నిఘా పెట్టామని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవంటున్నారు పోలీసులు.