తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో… ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండల్లా మారడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి లక్షా 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 7టీఎంసీల నీరు నిల్వ ఉంది. 16గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 69వేల 904 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 28వేల 252 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 844.20 అడుగులకు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 68.7145 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
read read : రేపు అల్పపీడనం… తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
ఇక ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లో భారీగా నీరు రాగా… వచ్చింది వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. అటు పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 532 అడుగుల మేర నీరు ఉంది. కాగా, శ్రీరాంసాగర్‌లో నీటిమట్టం దాదాపు పూర్తిస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి వైరా రిజర్వాయర్ జలకళ సంతరించుకుంది. పూర్తిగా నిండిపోయి 4 అలుగులు ద్వారా నీరు ప్రవహిస్తోంది. ఖరీఫ్ పంటకు ఆయకట్టు పరిధిలోని 25వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. ఇన్‌ఫ్లో 27వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 34,800 క్యూసెక్కులుగా ఉంది.
ప్రాజెక్టుకు చెందిన 4గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు అధికారులు. హైదరాబాద్ జంట జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. హిమాయత్‌సాగర్‌లోకి వెయ్యి క్యూసెక్కులు నీరు వచ్చి చేరింది. 3గేట్ల ద్వారా హిమాయత్‌సాగర్ నుంచి మూసీలోకి 1030 క్యూసెక్కులు నీరు వెళ్తోంది. హిమాయత్‌సాగర్ లో నీటిమట్టం 1762.75 అడుగులకు చేరగా.. ఉస్మాన్‌సాగర్లో నీటిమట్టం 1784.80 అడుగులకు చేరింది. ఉస్మాన్‌సాగర్‌లోకి 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అటు తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.