కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఎందరో జీవితాలు కకావికలం అయ్యాయి. కరోనా కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు ఉపాధి కోల్పోయారు. అంతేకాకుండా కరోనా మనిషి సగటు ఆయువులో కూడా కోత పెట్టేసింది. సాధారణంగా గతంలో ఓ మనిషి ఆరోగ్యంగా ఉంటే వందేళ్లు జీవించేవాడు. కానీ మారుతున్న కాలం, ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి సగటు ఆయువు తగ్గిపోయింది. అది చాలదన్నట్లుగా ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చి ఇంకా ఆయువులో కోత పెట్టిందని పరిశోధకులు చెప్తున్నారు. ఇటీవల ముంబైలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ (ఐఐపీఎస్) చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
Read Also: ఒకరిని ప్రేమించి.. మరొకరితో పెళ్లి.. యువతి నిరసన
ప్రజలపై కరోనా మహమ్మారి ఎంత మేరకు ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మరణాలను వారిని పరిగణనలోకి తీసుకున్నారు. కరోనా ముఖ్యంగా 35 ఏళ్ల నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న పురుషులపై ప్రభావం అధికంగా చూపిందని.. మృతుల్లో ఎక్కువగా ఈ వయసున్న పురుషులే ఉన్నారని పరిశోధకులు తెలిపారు. కరోనా రాకముందు అంటే 2019లో పురుషుల సగటు ఆయువు 69.5 ఏళ్లు, మహిళల సగటు ఆయువు 72 ఏళ్లు ఉండేది. అయితే కరోనా కారణంగా పురుషులు, మహిళల సగటు ఆయువు దాదాపు రెండేళ్లు తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు పురుషుల సగటు ఆయువు 67.5 ఏళ్లకు, మహిళల సగటు ఆయువు 70 ఏళ్లకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఆయుష్షు తగ్గడం తాత్కాలికమేనని, మళ్లీ ఇది మెరుగవుతుందని తాము ఆశిస్తున్నట్లు ఐఐపీఎస్ డైరెక్టర్ జేమ్స్ తెలియజేశారు.