KG to PG First Campus: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మానస పుత్రిక అయిన ‘కేజీ టు పీజీ’ కాన్సెప్ట్ త్వరలో అమల్లోకి రానుంది. పేద పిల్లలకు కిండర్ గార్టెన్ (కేజీ) నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) వరకు ఉచిత విద్య అందించాలన్న సీఎం కేసీఆర్ స్వప్నం సాకారం కాబోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావ్‌పేట మండల కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మించిన కేజీ టు పీజీ ఫస్ట్ క్యాంపస్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే పేద విద్యార్థులకు కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తామని ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దానికి తగ్గట్లే ఆయన ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల సంఖ్యను పెద్దఎత్తున పెంచారు. అయితే ఈ క్యాంపస్‌ను మాత్రం ప్రత్యేకంగా ‘కేజీ టు పీజీ’ కాన్సెప్ట్‌కి అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. గంభీరావ్‌పేటలో కేజీ టు పీజీ ఫస్ట్ క్యాంపస్‌ను ఏర్పాట్లుచేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ 2021లో ప్రకటించారు. ఆ ప్రకటన కార్యరూపం దాల్చింది. మన ఊరు-మన బడి ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో పూర్తిచేశారు. రహేజా ఫౌండేషన్.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద దీన్ని డెవలప్ చేసింది.
ఈ క్యాంపస్‌ను 6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. దీనికోసం రూ.3 కోట్లు ఖర్చుచేశారు. ఇక్కడ అన్నీ కార్పొరేట్ ఫెసిలిటీసే ఉండటం విశేషం. మొత్తం 3,500 మంది విద్యార్థులు చదువుకోవచ్చు. ప్రి-ప్రైమరీ, ప్రైమరీ, హైస్కూల్, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ తరగతులను మూడు (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ) భాషల్లో నిర్వహిస్తారు. 250 మంది చిన్నారులకు సరిపోయే అంగన్‌వాడీ సెంటర్ కూడా ఇక్కడ ఉండటం గమనార్హం. 70 క్లాస్ రూమ్‌లు, మోడ్రన్ డిజిటల్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్, 50 కంప్యూటర్లతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఉన్నాయి.
వెయ్యి మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేందుకు సరిపోయే విశాలమైన డైనింగ్ హాల్ కూడా ఈ క్యాంపస్ సొంతం. డిగ్రీ అమ్మాయిలకు ప్రత్యేకంగా హాస్టల్ ఉంది. 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ స్టేడియం, అథ్లెటిక్ ట్రాక్, క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్ కోర్టులను నిర్మించారు. లోకల్ ఎమ్మెల్యేతోపాటు మంత్రి కేటీఆర్ అపాయింట్‌మెంట్ దొరకగానే వాళ్లను కలిసి క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి తెలిపారు.