Karnataka Elections: కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. అయితే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ, మ్యాజిక్ ఫిగర్ 113 రాకపోవచ్చని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో మరోసారి జేడీఎస్ కింగ్ మేకర్ పాత్రను పోషించేందుకు సిద్ధం అయింది. అయితే ఇలాంటి పరిస్థితి వస్తే అధికారం ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమను సంప్రదించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు జేడీఎస్ చెబుతోంది. అయితే ఇటు బీజేపీ కానీ, అటు కాంగ్రెస్ కానీ జేడీయూ మాటల్ని పట్టించుకోలేదు. తాము ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదని, స్వయంగా అధికారంలోకి వస్తామని చెబుతున్నాయి.
Read Also: Suman: స్టార్ హీరోకి కోడలిగా సుమన్ కూతురు..?
ఇదిలా ఉంటే జేడీయూ నేత కుమారస్వామి ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన దూతలు కూడా సింగపూర్ వెళ్లినట్లు సమాచారం. అక్కడే కుమారస్వామితో మంతనాలు సాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఎన్నికలు ముగిసిన తర్వాత కుమారస్వామి మాట్లాడుతూ.. తాము ‘కింగ్ మేకర్’ కాదని ‘కింగ్’ అవుతామంటూ వ్యాఖ్యానించాడు. బీజేపీ, కాంగ్రెస్ తో పోలిస్తే మెరుగైన సీట్లు వస్తాయని అన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ మాత్రం జేడీఎస్ తో పొత్తు ఉండదని అన్నారు.
కాంగ్రెస్‌కే మద్దతా..?
సరైన సమయంలో సరైన నిర్ణయం వెల్లడిస్తామని జేడీఎస్ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ అన్నారు. తమను బీజేపీ, కాంగ్రెస్ సంప్రదిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న కుమారస్వామి మే 13 ఫలితాలు విడుదలయ్యే రోజు బెంగళూర్ రానున్నారు. అయితే దీనిపై ఇప్పటికే జేడీఎస్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవేగౌడ అభిలాష మేరకు కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చేందుకు జేడీఎస్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే అవినీతి కేసుల్లో ఉన్న కుమారస్వామి కేంద్ర సంస్థల నుంచి ఉపశమనం పొందాలంటే బీజేపీకి సపోర్టు చేస్తారని మరికొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేపు ఫలితాలు వెలువడితే తప్పా.. కర్ణాటక రాజకీయం ఓ కొలిక్కి రాదు.