మన దేశంలో రాజకీయ, సినిమా రంగం జమిలిగా కొన్ని దశాబ్దాలుగా ప్రయాణం సాగిస్తున్నాయి. చిత్రసీమకు చెందిన ఎంజీఆర్, ఎన్టీయార్, జయలలిత, కరుణానిధి వంటి ప్రముఖులు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రాణించారు. మరెందరో సినీ ప్రముఖులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో మంత్రులుగానూ పనిచేశారు. మరెందరో సొంత పార్టీలూ పెట్టారు. అయితే… సోమవారం వచ్చిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సినీ తారలకు మాత్రం ఓట్లరు చుక్కులు చూపించారు. మరీ ముఖ్యంగా తమిళనాట ‘మక్కల్ నీది కయ్యం’ పేరుతో సొంత పార్టీ పెట్టిన కమల్ హాసన్… తన నియోజకవర్గం నుండే గెలవలేక పోయారు. కోయంబత్తూర్ సౌత్ నుండి పోటీ చేసిన ఆయన్ని బీజేపీ మహిళా నేత ఓడించారు. ఇక కమల్ హాసన్ పార్టీ తరఫునే నిలబడిన సీనియర్ నటీమణి, దర్శకురాలు శ్రీప్రియ సైతం ఓడిపోయారు. రైటర్ స్నేహన్ కు పరాజయం తప్పలేదు. ఆయన పార్టీ ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది. అలానే కమల్ పార్టీతో కలిసి బరిలోకి దిగిన శరత్ కుమార్ సమత్తువ మక్కల్ కడ్చి అభ్యర్థులూ ఎక్కడా గెలవలేదు.
ఇక ఆ మధ్య వరకూ కాంగ్రెస్ లో ఉండి, తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ నటి ఖుష్బూ సైతం ఓటర్ల ను మెప్పించలేకపోయారు. పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన మన్సూర్ అలీఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఫలితం దక్కలేకపోయింది. ఇక నామ్ తమిళర్ కట్చి పార్టీని పెట్టి పోటీచేసిన సీనియర్ నటుడు, దర్శకుడు సీమాన్ సైతం ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. విశేషం ఏమంటే… తమిళనాడులో సినిమా రంగానికి చెందిన ఒకే ఒక యువ నటుడు విజయం సాధించాడు. అతనే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్. పలు చిత్రాలలో హీరోగా నటించి, కొన్ని సినిమాలూ నిర్మించిన ఉదయనిధి తొలిసారి చెపాక్ – ట్రిప్లికేన్ అసెంబ్లీ నుండి డీఎంకె తరఫున గెలిచారు. ఇక కేరళలోనూ బీజేపీ తరఫున బరిలోకి దిగిన అలనాటి హీరో సురేశ్ గోపీ సైతం ఓడిపోయారు.
దక్షిణాదిన సినిమా తారల పరిస్థితి ఇలా ఉంటే… బెంగాల్ లో మాత్రం తృణముల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన సినిమా వాళ్ళకు విజయం దక్కింది. ఉత్తర్ పారా నుండి పోటీచేసిన కాంచన్ మల్లిక్, బార్రక్ పూర్ నుండి టీఎంసీ తరఫున బరిలో దిగిన రాజ్ చక్రవర్తి, మెద్నీపూర్ నుండి పోటీ చేసిన జునేమలియా, బంకురా అసెంబ్లీలో నిలబడిన సయంతిక బెనర్జీ విజయ బావుటా ఎగరేశారు. టీఎంసీ నుండి పోటీ చేసిన నటి సయోనీ ఘోష్ మాత్రం అసాన్ సోల్ లో ఓటమి చవిచూసింది. ఇక బీజేపీ నుండి చండితల నియోజవర్గంలో నిలబడిన నటుడు యశ్ దాస్ గుప్తా ఓడిపోయారు. మొత్తం మీద సినిమా గ్లామర్ కంటే కూడా ఈ ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాలు, వాటి పనితనం చూసే జనం సినిమా వాళ్ళకూ ఓట్లేశారు.